Gujarat Elections 2022 : 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో 48 సౌరాష్ట్ర నుంచి వచ్చేవే! పాటిదార్, ఓబీసీల ప్రాబల్యమున్న ఈ ప్రాంతానికి రాష్ట్రంలో అధికారాన్ని నిర్ణయించే అవకాశాలున్నాయి. 2017 ఎన్నికల్లో సౌరాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ 28 సీట్లలో విజయం సాధించగా భాజపా 19 సీట్లతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.
నాటి ఎన్నికల్లో కమలనాథులు మూడంకెల మార్కు దాటకపోవటానికి కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవటానికి సౌరాష్ట్రే కారణం. 2015నాటి పాటిదార్ల ఉద్యమం ప్రభావం కాంగ్రెస్‌కు లాభించగా భాజపాను దెబ్బతీసింది. అధికారంలోకి వచ్చినా అసెంబ్లీలో మెజార్టీ తగ్గింది. ఈ ప్రాంతంలోని 11 జిల్లాల్లో మూడింట (మోర్బి, గిర్ సోమ్‌నాథ్, అమ్రేలి) భాజపా అసలు ఖాతానే తెరవలేకపోయింది.
ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరం. ఐదేళ్లలో అనేక మార్పులు వచ్చాయి. అప్పటి పాటిదార్ల ఆందోళన ప్రభావం ఇప్పుడంతగా లేదు. గత ఎన్నికల అనుభవం నేపథ్యంలో... భాజపా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించింది. కాంగ్రెస్‌లోని కీలక నేతలు, ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆకర్షించింది. పాటిదార్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్ ఇప్పుడు భాజపాలో చేరి... ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. అలాగని పాటిదార్లంతా భాజపాకు మద్దతిస్తున్నారనుకోవటానికీ లేదు.
భాజపాపై ఆగ్రహం లేదు అలాగని పూర్తిస్థాయి అనుగ్రహమూ లేదు. అందుకే ఒకవేళ పాటిదార్ల మద్దతు పూర్తిగా లభించకుంటే ప్రత్యామ్నాయంగా ఓబీసీలను కూడగట్టడానికి భాజపా వ్యూహాలు రచిస్తోంది. ఈ ప్రాంతంలో ఓబీసీలకు 40శాతం ఓట్లున్నాయి. 147 ఓబీసీ వర్గాలున్నాయి. అందుకే చాలామంది ఓబీసీలకు సీట్లిచ్చింది.