"ఈసారి ఎలాగైనా నీట్-2023లో నేను ఎంపిక కావాలి".. "దేవుడా! నా ఏకాగ్రతను తిరిగి పొందేలా చూడు".. "దిల్లీ ఎయిమ్స్.. ప్లీజ్".. "నాకు దిల్లీ ఐఐటీలో, తమ్ముడికి గూగుల్‌లో అవకాశం రావాలి"... ఇవన్నీ డైరీల్లో రాసుకొన్న విశేషాలు కావు. దేశంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే లక్షలాది విద్యార్థులకు శిక్షణ కేంద్రంగా ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో ఓ ఆలయ గోడలపై అభ్యర్థులు రాసుకొంటున్న ఆశల రాతలు.
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లు రావాలన్న ఆశలతో దేశం నలుమూలల నుంచి ఎంతోమంది విద్యార్థులు శిక్షణ కోసం ఏటా ఇక్కడికి వస్తుంటారు. ఈ ఏడాది కోటాలోని వివిధ కోచింగ్ సెంటర్లలో రికార్డు స్థాయిలో రెండు లక్షల మంది విద్యార్థులు కొత్తగా నమోదు చేసుకున్నారు. ఇలా వచ్చినవారు కొంతకాలానికే తీవ్రమైన ఒత్తిడి, అంచనాల మధ్య కూరుకుపోయి సతమతం అవుతుంటారు. ఇటువంటి విద్యార్థులకు స్థానిక తలవండీ ప్రాంతంలో ఉన్న రాధాకృష్ణ ఆలయం ఓ ఉపశమన కేంద్రంగా మారిపోయింది. నిత్యం 300 మందికి పైగా విద్యార్థులు సందర్శించే ఈ ఆలయ గోడలపై అభ్యర్థులు వారి మనసులోని ఆకాంక్షలను రాయడం గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది.
విద్యార్థుల రాతలతో ఆలయ గోడలు నిండిపోతుండటం వల్ల ప్రతి రెండు నెలలకు ఓసారి రంగులు వేయాల్సి వస్తోందని పూజారులు తెలిపారు. ప్రారంభంలో అభ్యంతరం తెలిపిన ఆలయ అధికారులు క్రమక్రమంగా విద్యార్థుల నమ్మకం చూసి 'విశ్వాసాల గోడ'గా దీనికి నామకరణం చేసినట్లు కిషన్ బిహారీ అనే పూజారి తెలిపారు. ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు ఈ ఆలయం ధ్యాన కేంద్రంగానూ ఉపయోగపడుతోందని మరో పూజారి త్రిలోక్‌శర్మ చెప్పారు. కష్టపడితే దేవుడి ఆశీస్సులు తప్పక ఉంటాయని ఇక్కడికి వచ్చే విద్యార్థులకు తీర్థ ప్రసాదాలు అందించి తాము చెబుతుంటామన్నారు. విద్యార్థులకు తోడుగా వచ్చే వారి తల్లిదండ్రులు సైతం ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.