ఏదైనా ఒక కొత్త విషయం సామాజిక మాధ్యమాల్లో వస్తే చాలు.. అనేకమంది ముందూ వెనకా ఆలోచించకుండా లైక్‌లు, షేర్లు కొట్టడం సహా ఫార్వర్డ్‌లు చేస్తూనే ఉంటారు. దాంట్లో నిజమెంతో, అబద్ధమెంతో కూడా సరిచూసుకోరు. వెంటనే ఇతర గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉంటారు. దీంతో ఆ సమాచారం క్షణాల్లోనే లక్షలాది మందికి చేరిపోతుంది. ఇటీవల కొన్ని సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు దాదాపు ఆరు గంటల పాటు నిలిచిపోవడం వల్ల అనేక వదంతులు వ్యాపించాయి.
Whatsapp: 'వాట్సాప్‌పై అవన్నీ వదంతులే.. ఎవరూ నమ్మొద్దు' - వాట్సాప్ నాట్ వర్కింగ్
వాట్సాప్‌ను రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు కేంద్రం నిర్ణయించిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ వదంతులను నమ్మొద్దని కేంద్రం తెలిపింది.
వాట్సాప్‌ను రాత్రి 11.30గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నిలిపివేస్తున్నట్టు కేంద్రం నిర్ణయించిందని, అలాగే దీన్ని యాక్టివ్ చేసుకోవాలంటే నెలవారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇదంతా అబద్ధపు ప్రచారమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ వేదికగా స్పష్టంచేసింది. అలాంటి ప్రకటన ఏదీ కేంద్రం చేయలేదని, వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.