పళనిస్వామి... జయలలిత తర్వాత తమిళనాడు పీఠాన్ని అధిరోహించిన ముఖ్యమంత్రి. 'అమ్మ' మరణం అనంతరం అన్నాడీఎంకేను ముందుండి నడిపిస్తున్న నేత ఆయన. రానున్న ఎన్నికల్లో గెలిచి మరోమారు సీఎం పదవిని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు. తనను ఇప్పటికే నాలుగుసార్లు గెలిపించిన ఎడప్పాడి నియోజకవర్గం నుంచే ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. అక్కడ ఆయనకున్న సానుకూలతలు ఏంటి? గెలుపు ఖాయమా?
'సామాజిక' బలం..
ఎడప్పాడి సామాజిక వర్గంలో వన్నియర్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. వారి మద్దతు పళనిస్వామికే ఉంది. దీనికి తోడు చేసిన అభివృద్ధి పనులు, సీఎంగా ఉన్న గుర్తింపుతో.. ఎడప్పాడిలో పళనిస్వామి గెలుపు ఖాయమని.. అన్నాడీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడుకు రెండో వరి ధాన్యాగారంగా పేరొందిన ఎడప్పాడి నియోజకవర్గానికి.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. చేనేత, పవర్ లూమ్స్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఎడప్పాడిలో అభ్యర్థుల గెలుపోటములను ఖాయం చేసే శక్తిగా.. వన్నియర్ సామాజిక వర్గం ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ద్వితీయ స్థానానికి పరిమితమైన పీఎంకే.. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలోనే భాగస్వామిగా ఉండటం గమనార్హం. 1977 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే 5 సార్లు, పీఎంకే 3 సార్లు గెలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒకే కూటమిలో ఉండటం వల్ల పళనిస్వామికి భారీ మెజారిటీ ఖాయమని విశ్లేషకులు కూడా అంటున్నారు.
ఇదీ చూడండి:-ప్రజా 'పరీక్ష'లో పళనిస్వామి పాస్ అయ్యేనా?