2021 జనవరి 27.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్మారకాన్ని అన్నాడీఎంకే నాయకద్వయం పళనిస్వామి, పనీర్‌సెల్వం ఆవిష్కరించిన ఈ రోజే.. ఆ పార్టీ వేటుకు గురైన తలైవి నెచ్చెలి వీకే శశికళ.. జైలుబంధం నుంచి విముక్తులయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు కారాగార శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. జయలలిత మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న చిన్నమ్మ.. మళ్లీ ఆ పదవిని దక్కించుకునేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు. అన్నాడీఎంకేలో 'కీలక హోదా' అధిరోహించేంత వరకు ఆమె విశ్రమించరని శశికళ సన్నిహితులు సైతం చెబుతున్నారు. ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపులకు కారణమవుతాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఈ విషయంపై ఉన్న అభిప్రాయభేదాలను పరిష్కరించేందుకు భాజపా అగ్రనేతల మధ్యవర్తిత్వంతో పళనిస్వామి, పనీర్‌సెల్వం- శశికళ మేనల్లుడు దినకరన్ మధ్య అనధికార చర్చలు జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పార్టీ అధికార పగ్గాలు తనకు అప్పగిస్తే స్వీకరించేందుకు శశికళ సిద్ధంగా ఉంటారని, లేదంటే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా పనిచేస్తారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పళనిస్వామి, పనీర్‌సెల్వంను అధికార పీఠం నుంచి దించేందుకు పావులు కదుపుతారని అంటున్నారు. పార్టీ అభిమానులను, మద్దతుదారులను తనవైపు లాక్కుంటారని విశ్లేషిస్తున్నారు.
"జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉండటం కూడా శశికళకు శిక్ష పడటానికి ఓ కారణం. జైలు శిక్ష అనుభవించిన తర్వాత డెల్టా, దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో శశికళకు సానుభూతి పెరిగింది. థెవార్ వర్గానికి ఈ ప్రాంతాల్లో మంచి పట్టుంది. ఇక్కడ అన్నాడీఎంకే ఓడిపోతే పార్టీలో పరిణామాలు మారిపోతాయి."
-రాజకీయ విశ్లేషకులు
జయలలిత మరణాంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ ఎంపిక చేసిన ఎడప్పాడి పళనిస్వామి మాత్రం తనను సీఎం కుర్చీపై కూర్చొబెట్టింది ఎమ్మెల్యేలే అని, చిన్నమ్మ కాదని చెబుతూ వస్తున్నారు. పళనిస్వామి, పనీర్‌సెల్వం ఐక్యంగా ఉన్నట్లే పైకి కనిపిస్తున్నారు. అయితే అధికార పంపిణీ విషయంలో లోపల ఇంకా విభేదాలు ఉన్నాయని పార్టీ వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. జయలలిత విధేయుడిగా చెప్పుకుంటూ పత్రికలు, టీవీ ఛానెళ్లలో వ్యక్తిగతంగా పనీర్‌సెల్వం ప్రచారం చేసుకోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది.
ఇదీ చదవండి:సవాళ్ల సుడిలో అన్నాడీఎంకే - పళనిస్వామి గట్టెక్కించేనా?
మేనల్లుడికి మద్దతివ్వలేరా?