తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​ మళ్లీ 'హస్త'గతం అవుతుందా?

Punjab assembly election 2022: దేశంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హస్తం పార్టీ.. కొన్నాళ్లుగా క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. 2014కు ముందు కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. వివిధ కారణాల వల్ల వరుసగా అధికారానికి దూరమవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు.. కీలకమైన పంజాబ్‌లో ఎన్నికల ముంగిట నిలిచింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. మళ్లీ పవర్​లోకి వస్తుందా? అంతర్గత పోరును ఎలా అధిగమిస్తుంది? ఎన్నికలకు నెలల ముందే ముఖ్యమంత్రిని మార్చడం సానుకూల ఫలితాలు ఇస్తుందా?

Will Punjab Congress win again?
పంజాబ్​ మళ్లీ 'హస్త'గతం అవుతుందా?

By

Published : Jan 31, 2022, 4:45 PM IST

Punjab assembly election 2022 : కాంగ్రెస్‌ పాలనలో ఉన్న కీలక రాష్ట్రాల్లో పంజాబ్‌ ఒకటి. ఇక్కడ పూర్తి మెజార్టీతో కాంగ్రెస్‌ ప్రస్తుతం అధికారంలో ఉండగా.. దాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు... మిగతా పార్టీలు పోటీ పడుతున్నాయి. స్థానిక పార్టీలతో పాటు జాతీయ పార్టీలు సైతం పంజాబ్‌ను హస్తగతం చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాయి. ఈ తరుణంలోనే కాంగ్రెస్‌ ఎలాంటి పోటీ ఇవ్వనుంది అన్నది కీలకంగా మారింది.

సాఫీగా సాగిపోవాల్సిన పార్టీ కార్యకలాపాలు.. ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే గందరగోళంగా మారాయి. అంతర్గత కలహాలు, కీలక నేతల ఒత్తిళ్లతో ఏకంగా తమ పార్టీ ముఖ్యమంత్రినే మార్చివేసింది అధిష్ఠానం. సుదీర్ఘ కాలం.. రాజకీయ అనుభవం ఉన్న బలమైన నేతను తొలగించి.. మరొకరికి ఆ బాధ్యతల్ని అప్పగించింది.

సిద్ధూ ఒత్తిడి మేరకే..

పంజాబ్‌ కాంగ్రెస్‌కు అధ‌్యక్షుడిగా ఉన్న నవజ్యోత్‌ సిద్ధూ ఒత్తిడి మేరకే.. అప్పట్లో ముఖ్యమంత్రిని మార్చింది. కొత్తగా ఆ బాధ్యతల్లోకి వచ్చిన చన్నీతోనూ సిద్ధూకు పొసగడం లేదన్న వార్తలు వస్తున్నాయి. తనకు అనుకూలంగా ఉండే అభ్యర్థులకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వలేదని, పార్టీ టికెట్ల కేటాయింపుల్లోనూ అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటే.. ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకోవాలో గెలిచిన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు కానీ, అధిష్ఠానం కాదని ఇటీవల వ్యాఖ్యానించారు సిద్ధూ. ఈ మాటలే ఆయనలో సీఎం కుర్చీపై ఆసక్తి ఉందని చెప్పేందుకు సరిపోతాయి. ఇవే కాదు.. ఇలాంటి వివాదాలు చాలానే ఉండగా.. వీటి మధ్యలో వీరిద్దరూ పార్టీని ఎలా విజయ తీరాలకు చేర్చుతారోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

సీఎం మార్పు సరైనదేనా?

జాతీయ స్థాయిలో బలంగా ఉన్నా.. లేకున్నా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అక్కడి సీఎంలను మారుస్తుంటుంది కాంగ్రెస్. ఆ కోవలోనే పంజాబ్‌ ముఖ్యమంత్రినీ మార్చింది. అయితే.. తదుపరి ఎన్నుకున్న చన్నీ విషయంలో కుల సమీకరణాల్ని సరిగానే అంచనా వేసింది అంటున్నారు కొందరు విశ్లేషకులు.

చరణ్‌ జిత్‌ చన్నీ.. దళిత వర్గానికి చెందిన జాట్‌ సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి. కాగా.. పంజాబ్‌లో దాదాపు 32శాతం మంది ఎస్సీ వర్గానికి చెందిన వారే. వీరిలో జాట్‌ సిక్కులు.. 20శాతానికి పైగానే ఉంటారు. చరణ్‌ ఎంపికతో వీరంతా కాంగ్రెస్‌ వైపు నిలబడతారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే.. పంజాబ్‌ రాజకీయాల్లో ఇంత పెద్ద పదవి ఆ వర్గం వారికి దక్కడం ఇదే తొలిసారి.

అమరీందర్​ ​ సింగ్‌పై రాష్ట్రంలో చాలా అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. సీ-ఓటర్‌ సర్వే ప్రకారం 60 శాతం మంది అమరీందర్​ సింగ్‌ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 15శాతం మందే అమరీందర్​ పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలానే.. ఆయన స్థానంలో చన్నీని ముఖ్యమంత్రిని చేయడం సరైన వ్యూహమేనని 63శాతం మంది పంజాబ్‌ ప్రజలు అభిప్రాయపడ్డారు.

ఇలా... సీఎం మార్పు విషయంలో కాంగ్రెస్‌కు కలిసిరావచ్చు. కానీ.. పార్టీలో ఇప్పటికీ అంతర్గత కలహాలు తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని పక్కకు నెట్టుకుని ఎలా నిలబడగలరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అమరీందర్​ సింగ్‌పై అసంతృప్తి

ఎక్కువ కాలం సీఎంగా పరిపాలన చేసిన అమరీందర్​ సింగ్‌ పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడూ.. ఆ ప్రభావం తర్వాత ఎన్నికలపై కచ్చితంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు. చన్నీ బాధ్యతలు తీసుకుని ఇంకా ఐదు నెలలు కూడా పూర్తి కాలేదు. ఈలోగా ఆయన చేసిన పనిని బేరీజు వేసుకుని... కాంగ్రెస్‌కే ఓటు వేస్తారనుకోలేమన్నది వారి మాట. ఇదే విషయం వివిధ సర్వేల్లోనూ తేలింది.

ప్రముఖ సంస్థలు.. పంజాబ్‌లో నిర్వహించిన సర్వేల ప్రకారం... కాంగ్రెస్‌కు ఈ సారి ఎదురు గాలి వీచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే.. అమరీందర్​ సింగ్‌, కాంగ్రెస్‌, అకాలీదళ్‌ పాలన చూసిన ప్రజలు... ఈ సారి ఆప్‌ వైపు మొగ్గే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. అయితే... ఎన్నికల సమయానికి ప్రజలు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని చెబుతున్నారు.

లోపాలను సరిచేసేందుకు..

గత పాలనలోని లోపాల్ని తెలివిగా సరిచేసేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్‌. అందుకే.. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు.. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ.

ఈ తీరుగానే కులాల సమీకరణాల్నీ లెక్కలోకి తీసుకుని... దళిత, అగ్రవర్ణ హిందువుల్ని ఆకర్షించేందుకు సరికొత్త పథకాల్ని ప్రకటిస్తోంది. కాంగ్రెస్‌కు కలిసి రానున్న మరో అంశం... మిగతా పార్టీలకు బలమైన ప్రజాకర్షక నేతలు లేకపోవడం.

ఆప్‌ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాలే కనిపిస్తున్నారు. కానీ.. కాంగ్రెస్‌కు సిద్దూ ఎప్పటి నుంచో ప్రముఖ నేతగానే ఉంటున్నారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీ సైతం సుదీర్ఘ కాలం శాసన సభ్యుడిగా ఉండడం వల్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇదీ తమకు కలిసి వస్తుందనుకుంటోంది కాంగ్రెస్‌.

సాగు చట్టాలపై పోరుకు కాంగ్రెస్‌ గట్టి మద్దతే ఇచ్చింది. కానీ.. పంజాబ్‌ రైతులు ఆ పార్టీ వైపు మొగ్గుతారని చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు. అలానే.. ఇటీవల అమృత్​సర్ స్వర్ణ దేవాలయంలో భద్రతా వైఫల్యాలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారవచ్చని భావిస్తున్నారు.

ఇదీ చడవండి:Up election 2022: యూపీలో 'కుర్మీ' వర్గం మెప్పు పొందేదెవరు?

ABOUT THE AUTHOR

...view details