uttarakhand polls 2022: దేవభూమి ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడి అసెంబ్లీలో 70 శాసనసభ స్థానాలు ఉండగా.. అధికార భాజపా- ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు నెలకొంది. అధికారం నిలబెట్టుకోవాలని కమల దళం.. ఎంత కష్టమైనా పవర్లోకి రావాలని హస్తం పార్టీ తహతహలాడుతున్నాయి. అయితే ఉత్తరాఖండ్‌లో భాజపా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి.. తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి.
దీనికి కారణాలు లేకపోలేదని అటు సర్వేలు, ఇటు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ముఖ్యమంత్రుల మార్పు, అపరిష్కృతంగా స్థానిక సమస్యలు ఈ ఎన్నికల్లో పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
దీనికితోడు అసెంబ్లీ సీటు ఆశించి.. భంగపడ్డ నేతలు, తొలి జాబితాలో స్థానం కోల్పోయిన ఎమ్మెల్యేలతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి తాజాగా పార్టీకి తలనొప్పిగా మారింది.
అయితే భాజపాకు ఎన్ని సమస్యలు ఎదురైనా.. ప్రధాని మోదీ ఛరిష్మా గట్టేక్కిస్తుందని రాష్ట్ర నాయకత్వం బలంగా నమ్ముతోంది. దీనికి గత ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపుతున్నారు నేతలు.
2017 ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా..
2014, 2017, 2019 ఎన్నికల్లో మోదీ ఇమేజ్‌తో భాజపా రాష్ట్రంలో సత్తా చాటింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఏకంగా 57 సీట్లను భాజపా సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా అదే ప్రధాన వ్యూహంగా నాయకత్వం ముందుకు సాగుతోంది.
ఇందుకోసం రెండు నెలల కింద ప్రధాని మోదీతో ఎక్కువ సభలు నిర్వహించాలని రోడ్‌మ్యాప్‌ను కూడా నాయకత్వం సిద్ధం చేసింది. అందులో భాగంగానే డిసెంబర్ 4, 30 తేదీల్లో మోదీతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయించారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష ప్రచారాలకు ఆస్కారం లేకపోవడం వల్ల ఎన్నికల ప్రచార సభలు వాయిదా పడ్డాయి.
" వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలో భాజపా విజయం సాధిస్తుంది. ఉత్తరాఖండ్ కోసం ఆయన సుదీర్ఘ కాలం పని చేస్తారు.
-ప్రహ్లాద్ జోషి, ఉత్తరాఖండ్ భాజపా వ్యవహారాల బాధ్యుడు
bjp Dissent category
భగ్గుమంటున్న అసమ్మతి..
ఇటీవల 59 అసెంబ్లీ స్థానాలకు తొలి జాబితాను సిద్ధం చేయగా.. అందులో 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టింది భారతీయ జనతా పార్టీ. దీంతో అసమ్మతి భగ్గమంది. దీంతో ఎమ్మెల్యేలతో పాటు కీలక నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం కల్పించడం వల్ల.. పార్టీనే నమ్ముకున్న కొందరు నేతలు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు.
అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు స్వతంత్రంగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. అసమ్మతి వర్గంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు తరాలి ఎమ్మెల్యే మున్నీ దేవి షా, ద్వరాహత్ ఎమ్మెల్యే మహేశ్ నేగీ.