234...తమిళనాడులోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య. చెన్నై పీఠం ఎవరిదో తేల్చడంలో ప్రతి స్థానమూ కీలకమే. కానీ... ప్రజల దృష్టిని ఆకర్షించేది మాత్రం ప్రముఖులు బరిలో నిలిచిన కొద్ది సీట్లే. ప్రజల్లోని ఈ ఆసక్తికి తగ్గట్టుగానే ప్రముఖులు కూడా అతి జాగ్రత్తగా వ్యవహరిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా.. ఏ స్థానం నుంచి పోటీ చేయాలి? అన్న విషయంపై ఎన్నో ప్రణాళికలు రచిస్తారు. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఆనాటి దిగ్గజ నేతల నుంచి ఈరోజు ఉన్న పలువురు ప్రముఖల నియోజకవర్గాల కసరత్తుల గురించి తెలుసుకుందాం.
పక్కా ప్రణాళిక
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత.. తన రాజకీయ ప్రస్థానంలో అనేక నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. బోడినాయకనౌర్ నుంచి చెన్నైలోని ఆర్కే నగర్ వరకు ఎన్నో సీట్లలో బరిలో దిగారు. అయితే ప్రతి దాని వెనుక ఓ వ్యూహం ఉండేది. పక్కా ప్రణాళిక ఉండేది. అన్నింటినీ లెక్కేసి.. కచ్చితంగా గెలుస్తాననే ధీమా వచ్చినప్పుడే ఆమె ఆ నియోజకవర్గాన్ని ఎంచుకునే వారు.
డీఎంకే అధినేత కరుణానిధిది కూడా ఇదే కథ. పోటీ చేసిన ప్రతి ఎన్నికలో గెలుపొందిన ఘనత దివంగత నేత సొంతం. హార్బర్, సైదపేట్, అన్నా నగర్, చెపాక్, కులిథలై నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఇక్కడ కూడా పక్కా ప్రణాళిక ఉండేది.
ఆనాటి నేతలనే ఈనాటి ప్రముఖ నాయకులు కూడా అనుసరిస్తున్నారు. ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునే ముందు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. విజయావకాశాలు ఎక్కువగా ఉన్న సీట్లనే ఎంచుకుంటున్నారు.
ఇదీ చూడండి:-తమిళనాట వాళ్లు లేకపోయినా వాడీవే'ఢీ'!
కమల్ హాసన్
మక్కల్ నీధి మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ పార్టీని ప్రకటించినప్పటి నుంచి.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపై విపరీతంగా చర్చ జరిగింది. ఆయన చెన్నె నుంచే బరిలో దిగుతారని ఊహాగానాలు జోరుగా వినిపించాయి. అనంతరం.. సొంత ఊరు పరమకుడి నుంచే ఎన్నికల్లో నిలబడతారని అనేకమంది అంచనా వేశారు.
వాటికి చెక్ పెడుతూ.. దక్షిణ కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు కమల్. ఇక్కడ ఆయన ప్రధాన ప్రత్యర్థి.. భాజపా నేత వనతి శ్రీనివాసన్.
కొంగు మండలంగా పిలిచే ఈ ప్రాంతంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కమల్ పార్టీకి ఇక్కడ లక్షకు పైగా ఓట్లు దక్కాయి. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా నగరాల్లో పార్టీకి ఎక్కువ ఆదరణ ఉండటం కమల్ నిర్ణయానికి కారణం.
దినకరన్
ఏఎమ్ఎమ్కే నేత దినకరన్.. చెన్నై ఆర్కే నగర్ నుంచి కోవిల్పట్టికి తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుకుడి సీటు(కోవిల్పట్టి ఉన్న ప్రాంతం) నుంచే ఆయన పార్టీ 8 శాతం ఓట్లు దక్కించుకుంది. డీఎంకే-అన్నాడీఎంకేకు షాక్ ఇస్తూ.. స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటింది. పార్టీ మద్దతుదారుడు మాణిక్‌రాజ్ కారణంగా ఈ విజయాలను అందుకుంది.
వీటన్నింటినీ లెక్కలోకి తీసుకునే.. ధైర్యం చేసి కోవిల్పట్టి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు దినకరన్.
ఉదయనిధి స్టాలిన్
డీఎంకే అధినేత స్టాలిన్ వారసుడిగా.. ఉదయనిధి స్టాలిన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన చెపాక్- ట్రిప్లికేన్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కరుణానిధి.. ఇక్కడి నుంచే మూడుసార్లు గెలుపొందారు. మైనారిటీల ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి.