దేశ రాజధానిలో టీకా కొరత తీవ్రంగా ఉందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. డోసులు అందుబాటులో లేకపోవడం వల్ల 18-44 ఏళ్ల వయసు వారికి టీకా అందించే కేంద్రాలు మూతపడుతున్నాయని చెప్పారు. టీకాలు వెనువెంటనే అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. నెలకు 80 లక్షల చొప్పున డోసులు అందించాల్సిందిగా కోరారు.
"డోసుల కొరత వల్ల యువతకు టీకా అందించే కేంద్రాలన్నీ ఆదివారం నుంచి మూతపడతాయి. యువతకు టీకా అందించాలంటే దిల్లీకి నెలకు 80 లక్షల డోసులు కావాలి. కానీ ఇప్పటివరకు మే నెలలో 16 లక్షల డోసులు మాత్రమే మాకు వచ్చాయి. జూన్లో దిల్లీకి వచ్చే డోసుల కోటాను కేంద్రం మరింత తగ్గించి 8 లక్షలకే పరిమితం చేసింది. రాజధానిలోని యువత అందరికీ టీకా అందించాలంటే 2.5 కోట్ల డోసులు అవసరం."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం
ఈ నేపథ్యంలో దేశంలో టీకా డోసుల లభ్యతను పెంచేందుకు కేంద్రానికి నాలుగు సూచనలు చేశారు దిల్లీ సీఎం కేజ్రీవాల్. కొవాగ్జిన్ ఫార్ములాను పంచుకునేందుకు భారత్ బయోటెక్ అంగీకారం తెలిపిన నేపథ్యంలో.. దేశంలో టీకా తయారు చేయగలిగిన సంస్థలన్నీ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 24 గంటల్లోగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు.