కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాదిగా నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అన్నదాతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా నేత, మాజీ మంత్రి మనీష్ గ్రోవర్‌కు శుక్రవారం హరియాణాలోని రోహ్‌తక్ జిల్లాలో నిరసనల సెగ తగిలింది. తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ.. ఓ ఆలయంలో ఉన్న ఆయన్ను బయటికి రాకుండా భారీ సంఖ్యలో రైతులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఆయన బయటకురాగలిగారు. అయితే.. ఈ ఘటన విషయంలో శనివారం భాజపా స్థానిక ఎంపీ అరవింద్ శర్మ.. సంబంధిత వ్యక్తులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
'మా నేత జోలికొస్తే కళ్లు పీకేస్తా.. చేతులు నరికేస్తా' - కాంగ్రెస్ పార్టీపై అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
హరియాణా భాజపా ఎంపీ అరవింద్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్‌ను వ్యతిరేకించే వారి కళ్లు పీకి, చేతులు నరికేస్తానని రైతులను హెచ్చరించారు. ఛండీగఢ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భాజపా ఎంపీ శర్మ తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్ కు మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశారు.
మనీష్ గ్రోవర్‌ను ఎదురించేవారి కళ్లు పీకేస్తానని, చేతులు నరికేస్తానని ఎంపీ హెచ్చరించారు. ఓ బహిరంగ కార్యక్రమంలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. దీంతోపాటు ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగారు. ఇదిలా ఉండగా.. భాజపా రాజ్యసభ ఎంపీ రాంచందర్ జాంగ్రా సైతం 'నిరసనకారులంతా పనీపాట లేని తాగుబోతులంటూ' చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో హిసార్ జిల్లా నార్‌నౌంద్‌కు వచ్చిన ఆయన్ను రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయన కారు సైతం ధ్వంసమైంది.
ఇదీ చూడండి:'జయలలిత వారసురాలిని నేనే.. శశికళను కలుస్తా '