తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అజేయుడు ఊమెన్‌ చాందీ.. 12వ సారి బరిలోకి

కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్​ సీనియర్​ నేత ఊమెన్​ చాందీ.. 12వ సారీ అదే నియోజక వర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన 77ఏళ్ల చాందీ.. ఇప్పటివరకు ఓటమి ఎరుగకుండా 12 సార్లు గెలుపొందారు. శాసనసభ్యుడిగా ఇటీవల తన 50ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.

Will former CM Oommen Chandy's Puthupally constituency lean to the left this time?
అజేయుడు ఊమెన్‌ చాందీ

By

Published : Apr 5, 2021, 1:01 PM IST

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఊమెన్‌ చాందీ(77) ఖాతాలో ఓ అరుదైన ఘనత ఉంది. ఇప్పటివరకు ఆయన 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే. ఎన్నడూ పార్టీ మారిందీ లేదు. గత ఏడాది సెప్టెంబరు 17 నాటికి శాసనసభ్యుడిగా చాందీ ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నారు. తాజాగా మరోసారి (12వ సారి) పూతుపల్లి నుంచి ఎన్నికల బరిలో దిగారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు.

ఆదివారమైతే అక్కడే..

పూతుపల్లే తన కార్యక్షేత్రమని, వీలైనంత వరకు ప్రజల మధ్య ఉండటమే తన విజయ రహస్యమని చాందీ వినయంగా చెబుతుంటారు. ఎన్ని పనులున్నా, ఏ హోదాలో ఉన్నా ప్రతి శనివారం రాత్రికి ఆయన పూతుపల్లి చేరుకుంటారు. ఆదివారం అంతా నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. ఐదు దశాబ్దాలుగా దాన్ని ఓ నియమంగా పెట్టుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడూ ఇదే పాటించారు. ప్రత్యేక సందర్భాలు మాత్రం అందుకు మినహాయింపు. ప్రజలతో ఈ అవినాభావ సంబంధమే ఆయన్ను ఆదర్శ రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దింది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనపై సౌర కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు వచ్చినా జనం విశ్వసించలేదు. అప్పట్లో ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినా ఓటర్లు ఆయనకు దన్నుగా నిలిచారు. చాందీ 1977లో కె.కరుణాకరన్‌ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండుసార్లు (2004- 2006, 2011- 2016) ముఖ్యమంత్రిగానూ పనిచేశారు.

ఇదీ చదవండి:విజయన్‌ చరిత్ర సృష్టిస్తారా?

అభ్యర్థిత్వంపై మొదట్లో ఊగిసలాట

పూతుపల్లిలో ఈ దఫా చాందీ అభ్యర్థిత్వంపై తొలుత కొంత ఊగిసలాట నెలకొంది. ఆయన్ను పార్టీ అధిష్ఠానం నెమోమ్‌ నుంచి బరిలోకి దించనున్నట్లు వార్తలొచ్చాయి. నెమోమ్‌.. రాష్ట్రంలో భాజపా ఖాతాలోని ఏకైక సిట్టింగ్‌ స్థానం. ఈసారి అక్కడ కమలదళం తరఫున కుమ్మనం రాజశేఖరన్‌ పోటీ చేస్తున్నారు. గతంలో మిజోరాం గవర్నర్‌గా పనిచేసిన ఈ దిగ్గజ నేతను ఎదుర్కోవాలంటే చాందీ లాంటి సీనియర్‌ అవసరమన్న ఉద్దేశంతో.. ఆయన పేరు తెరపైకి వచ్చింది. కానీ పార్టీ శ్రేణుల నిరసనలతో అధినాయకత్వం వెనక్కి తగ్గింది. చాందీకి మళ్లీ పూతుపల్లి టికెట్‌ కేటాయించింది.

ఇదీ చదవండి:కేరళ పోరులో 26ఏళ్ల అరిత ఎంతో ప్రత్యేకం!

ఎన్నిక లాంఛనమేనా.?

పూతుపల్లిలో చాందీకి పోటీగా ఎల్‌డీఎఫ్‌ కూటమి తరఫున 31 ఏళ్ల జైక్‌ సి.థామస్‌ను సీపీఎం నిలబెట్టింది. 2016లోనూ ఆయన చాందీపై పోటీచేశారు. భాజపా అభ్యర్థి ఎన్‌.హరి కూడా బరిలో ఉన్నప్పటికీ, ఆయన ప్రభావం నామమాత్రమే. చాందీ, థామస్‌ ఇద్దరూ క్రైస్తవులే. చాందీ ఆర్థడాక్స్, థామస్‌ జాకోబైట్‌ చర్చి వర్గాలకు చెందినవారు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ దఫా చాందీకి చెక్‌ పెట్టడానికి సీపీఎం సర్వశక్తులూ ఒడ్డుతోంది. అయినప్పటికీ మాజీ సీఎందే విజయమన్నది విశ్లేషకుల అంచనా.

ఇదీ చదవండి:ఎన్నికల ప్రచారానికి తెర- మంగళవారం పోలింగ్

ABOUT THE AUTHOR

...view details