కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజువారి కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువవుతోంది. అన్ని రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ వైరస్ భయాలు మొదలయ్యాయి. ఇటీవల ఐదు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్నికల ర్యాలీలు, ప్రచార పంథా కరోనా వ్యాప్తి భయాలను మరింత పెంచింది. ఎన్నికల సభల్లో భారీగా జనం గుమిగూడటం, కిలోమీటర్ల పొడవున ర్యాలీలతో కరోనా నిబంధనలను గుడ్డిగా అతిక్రమించారు.
ఈ నేపథ్యంలో చివరి మూడు దశల ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ కోరుతోంది. కాగా, ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా.. స్వాగతిస్తామని భాజపా, కాంగ్రెస్ కూటమి స్పష్టం చేశాయి.
ఈ పరిస్థితుల మధ్య.. ఎన్నికల సంఘం ప్రచార సమయాన్ని కుదించింది. భారీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటామని తమవంతుగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటించాయి. తమ ప్రచార సభలకు 500 మందికన్నా ఎక్కువ మంది ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటామని భాజపా తెలిపింది. అంతకుముందు, టీఎంసీ సైతం ఇదే తరహా జాగ్రత్తలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రచారాలకు కోతపడటం.. ఎన్నికల ఫలితాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫలితాల లెక్కలను కరోనా తారుమారు చేసే అవకాశం ఉందా? అనే చర్చ మొదలైంది.
విశ్లేషకులు అలా.. పార్టీలు ఇలా..
ఏ ఎన్నికలైనా చివరి క్షణం వరకు ప్రచారం చేయడం రాజకీయ పార్టీలకు పరిపాటే. ఆఖరి నిమిషంలో ఓటర్లను చేరుకుంటే.. పార్టీలకు కలిసివస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతుంటారు. కాబట్టి.. ప్రచారంపై పడుతున్న ఈ ప్రభావం ఎన్నికలపై తప్పక చూపే అవకాశం ఉంది. అయితే, ఇవేవీ ఫలితాల గతిని మార్చబోవని.. అధికార టీఎంసీ, అధికారంలోకి రావాలనుకుంటున్న భాజపా ధీమాగా చెబుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేత తాపస్ రాయ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ రాజకీయాలపైనే తాము నమ్మకం ఉంచుతామని చెబుతున్నారు.
"ఎన్నికలు ప్రతి ఏడాదీ వస్తుంటాయి. వీటికంటే మనుషుల ప్రాణాలే ముఖ్యం. కాబట్టే మేం స్వచ్ఛందంగా ప్రచార సమయాన్ని కుదించాం. ఇలాంటి సంక్షోభ సమయంలో ఎంతగా ప్రచారం చేశామన్నది ముఖ్యం కాదు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటారు. భాజపా రోజంతా ప్రచారం చేసినా.. ప్రజలు ఆ పార్టీకి మద్దతు ఇవ్వరు."
- తపస్ రాయ్, టీఎంసీ నేత
కరోనా సమయంలో ప్రజలను ఎలా రక్షించాలనే విషయానికే ప్రాధాన్యం ఇవ్వాలని భాజపా నేత సిసిర్ బజోరియా పేర్కొన్నారు. బంగాల్ ప్రజలు ఎవరికి ఓటేయాలనే విషయంపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.