OP Rajbhar News: ఉత్తర్‌ప్రదేశ్ శాససనభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రజాకర్షక హామీలతో ఓట్ల వేటను ముమ్మరం చేశాయి. ఇదే క్రమంలో ఓ చిన్న పార్టీ అధినేత.. విచిత్ర వాగ్దానంతో అందరి దృష్టిని ఆకర్షించారు. తమ పార్టీ గెలిచి, యూపీలో అధికారంలోకి వస్తే.. ట్రిపుల్ రైడింగ్ నేరం కాదని ప్రకటిస్తామని చెప్పారు.
సమాజ్‌వాదీ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగిన సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఈ హామీ ఇచ్చారు. ట్రిపుల్ రైడింగ్ ఎందుకు నేరం కాదో వివరిస్తూ.. ఓ పెద్ద లాజిక్ చెప్పారు.
"రైలులో 70 సీట్లు ఉంటే 300 మంది ప్రయాణిస్తారు. కానీ రైలుకు చలాన్ వేయరు. మరి అలాంటప్పుడు బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తే చలాన్ ఎందుకు వేస్తారు? ఏదైనా గ్రామంలో గొడవ జరిగిందని సమాచారం అందితే ఇద్దరు పోలీసులు బైక్‌పై ఆ ఊరు వెళ్తారు. నిందితుడ్ని అదే బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకుని ముగ్గురూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వస్తారు. మరి ఆ పోలీస్‌కు చలాన్ ఎందుకు వేయరు? మా ప్రభుత్వం వచ్చాక.. బైక్‌పై ముగ్గురు ప్రయాణించొచ్చు. అలా కుదరదంటే జీపులు, రైళ్లకు కూడా చలాన్లు వేస్తాం" అని వారణాసిలో వివరించారు రాజ్‌భర్.
ఘాజీపుర్ జిల్లా జహూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు రాజ్‌భర్.