AIMIM Factor in UP: అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష ఎస్పీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో పక్షం ఏఐఎంఐఎం. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. యూపీ ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
''ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సవాల్‌ను మేము స్వీకరిస్తున్నాం. శక్తిమేరకు పోరాడుతాం''.. జనవరి 8న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ ప్రకటించిన వెంటనే.. ఒవైసీ ఇలా ట్వీట్ చేశారు.
ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్నా ఒవైసీ మాత్రం.. ఉత్తర్ప్రదేశ్పై దృష్టంతా పెట్టారు. రాష్ట్రంలో బలమైన ముస్లిం ఓటు బ్యాంకు ఉంటడం.. దేశంలోనే జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం కావడం.. ప్రధానంగా చిరకాల ప్రత్యర్థి భాజపాను ఇక్కడ గద్దె దింపి.. తద్వారా 2024 ఎన్నికల్లో కాషాయపార్టీని బలహీనపరచాలన్న లక్ష్యమే దీని వెనుక ఉన్న కారణం.
అందుకే ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి పొత్తులు, ఎత్తుల వ్యూహాల్లో నిమగ్నమయ్యారు అసద్. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కాళ్లకు చక్రాలు కట్టుకొని యూపీ- దిల్లీ మధ్య తిరుగుతున్నారు.
పొత్తులు ఎత్తులు..
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటికే పొత్తులు ఖరారు చేసుకొని ముందుకెళ్తున్నారు ఒవైసీ. భారత్ ముక్తి మోర్చా అధినేత బాబు సింగ్ కుశ్వాహా నేతృత్వంతో ఐదు పార్టీలతో కలిసి 'భాగీదారీ పరివర్తన్ మోర్చా' కూటమిగా యూపీ బరిలోకి దిగుతున్నారు. 100 స్థానాల్లో పోటీ చేస్తామని గతంలోనే ప్రకటించిన ఎంఐఎం అధినేత.. ప్రస్తుతానికి 66స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే అందులో ఎక్కువ శాతం ముస్లింలే ఉన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా రావడం వల్ల.. అదే ఉత్సాహంతో యూపీ ఎన్నికల్లో చక్రం తిప్పాలని అనుకున్నారు ఒవైసీ. ఈ క్రమంలో ఎస్పీతో కానీ.. బీఎస్పీతో కానీ పొత్తు పెట్టుకోవాలని ఆయన అనుకున్నప్పటికీ.. ఆ చర్చలు ముందుకు సాగలేదు. దీంతో చిన్న పార్టీలతో కలిసి జట్టు కట్టారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు..
అయితే ప్రచారంలో వినూత్నంగా ముందుకెళ్తున్నారు ఒవైసీ. యూపీ ఎన్నికల్లో కొత్తగా ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రతిపాదనను ఆయన ముందటేసుకున్నారు. తమ కూటమి గెలిస్తే.. ఒకరు ఓబీసీ వర్గానికి చెందిన వారు.. మరొకరు దళిత వర్గానికి చెందిన వారు సీఎం అవుతారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంలను కూడా అదే స్థాయిలో వెనుకబడిన సామాజిక వర్గాలకు కేటాయిస్తామని ప్రకటించారు.
ఎవరికి మైనస్ అవుతుంది?
యూపీ ఎన్నికల్లో ఒవైసీ ముస్లింల రాజకీయ ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతున్నారు. 20శాతం జనాభా ఉన్న ముస్లింల ప్రాధాన్యంపై ప్రచారం చేస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇన్నాళ్లు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంకులుగా మార్చుకొని.. బానిసలుగా చూశాయంటూ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా '80-20' అనే ఫార్ములాతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సెంటిమెంట్‌తో ముస్లింలు ఏ కొద్ది శాతం మంది అయినా.. ఓవైసీ వైపు మొగ్గినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెనుమార్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 18జిల్లాల్లోని 140కుపైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే సామర్థ్యం ముస్లింలకు ఉంది.