తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యడియూరప్ప 'రాజీ'నామా సంకేతాలు- వారి కోసమే! - KA YEDIYURAPPA

yediyurappa
యడియూరప్ప

By

Published : Jul 22, 2021, 11:45 AM IST

Updated : Jul 22, 2021, 10:28 PM IST

11:42 July 22

రాజీనామా సంకేతాలు ఇచ్చిన కర్ణాటక సీఎం!

కర్ణాటక ముఖ్యమంత్రి రాజీనామాపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపా అధిష్ఠానం చెప్పినట్లు తాను నడుచుకుంటానని అన్నారు. తన భవిష్యత్తుపై జులై 25న అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.  

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు నాపై ప్రత్యేకమైన ప్రేమ, నమ్మకం ఉన్నాయి. 75 ఏళ్లు నిండిన ఎవరికీ ఎలాంటి పదవులను భాజపా కట్టబెట్టలేదని తెలుసు. కానీ, నా పనితీరు నచ్చి 78 ఏళ్ల వయసున్న నాకు అవకాశం కల్పించారు."  

- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి

జులై 26న యడియూరప్ప ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో.. ఆ రోజున ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. పార్టీని బలోపేతం చేసి, మరోసారి అధికారంలోకి తీసుకురావడమే.. తన కర్తవ్యం అని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు తమ సందేహాలను వీడి, తనకు సహకరించాలని కోరారు. 'నిరసనలను వ్యక్తం చేస్తూ ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయవద్దు. అలాంటి వాటికి జోలికి వెళ్లకుండా నాతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఆయన విజ్ఞప్తి చేశారు.  

అనుచరుల మద్దతు..

వీరశైవ లింగాయత్​ సామాజిక వర్గానికి చెందిన నేతలు, అనుచరులు సహా ఆల్​ ఇండియా వీర శైవ మహాసభ యడియూరప్పకు తమ మద్దతు ప్రకటించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్పను తొలగిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. 

ఆందోళనలో యడ్డీ మంత్రివర్గం!

యడియూరప్ప రాజీనామా సంకేతాలు.. ​కర్ణాటక మంత్రులను ఆందోళనలో నెట్టేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ యడియూరప్ప నిజంగానే పదవి నుంచి వైదొలిగితే.. కొత్త మంత్రివర్గాన్ని నూతన ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తారు. అప్పుడు తమకు మంత్రి పదవి మళ్లీ దక్కుతుందో, లేదోనని వారు దిగులు పడుతున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం యడియూరప్ప మంత్రివర్గంలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులు ఉన్నారు. మరోవైపు.. కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు యడియూరప్ప తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ క్రమంలో వారు తమ పదవులపై ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.  

వారి రాజకీయ భవిష్యత్తు కోసమేనా?

పార్టీలో తమ కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసమే యడ్డీ.. ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శివమొగ్గ లోక్​ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యడియూరప్ప తనయుడు రాఘవేంద్రకు పార్టీలో మంచి స్థానం కల్పించాలని ఆయన ఆలోచిస్తున్నారని సమాచారం.  

మరో తనయుడు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయేంద్ర.. గతంలో వరుణ నియోజకవర్గం నుంచి టికెట్​ ఆశించి భంగపడ్డారు. తన తండ్రి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయనకు టికెట్​ దక్కలేదు. ఇప్పుడు హంగల్​ నియోజకవర్గంపై విజయేంద్ర దృష్టి సారించారు. కానీ, ఇప్పటికీ ఆయనకు ఆ స్థానం నుంచి టికెట్​ వస్తుందన్నదానిపై సందేహాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాను రాజీనామా చేసి, తన కుమారులకు పార్టీలో కీలక స్థానం కల్పించాలని యడియూరప్ప యోచిస్తున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

తదుపరి సీఎంపై కీలక వ్యాఖ్యలు.. 

జులై 25న అధిష్ఠానం నుంచి సందేశం అందుతుందని, దాని కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు యడియూరప్ప. జులై 26 తర్వాత ఏం జరుగుతుందనే చూద్దామని పేర్కొన్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఏం చెప్పలేన్నారు. 

" ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఏ నిర్ణయమైనా హైకమాండ్​ తీసుకుంటుంది. కనీసం ఏ కమ్యూనిటీకి  ఆ అవకాశం లభిస్తుందనే అంశాన్ని చెప్పలేను. ఎలాంటి గందరగోళం లేదు. పార్టీ నాయకత్వంతో విబేధాలు లేవు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్​ షా జీ నాకు సూచించిన దానికి కట్టుబడి ఉంటా. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కేంద్రాన్ని ఒత్తిడి చేయలేదు. "

- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి. 

Last Updated : Jul 22, 2021, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details