భర్త 12వ తరగతి మాత్రమే చదివాడని అతడి నుంచి విడాకులు కోరింది ఓ భార్య. రెండేళ్ల క్రితం అతడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ మహిళ.. విడాకుల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. భర్త తనకంటే తక్కువ చదువుకున్నాడని.. దీంతో ఇద్దరు చదువుల్లో భారీ వ్యత్యాసం ఉందని న్యాయస్థానానికి తెలిపింది.
ప్రేమించి పారిపోయి పెళ్లి.. రెండేళ్లకు ఆమెకు తెలిసిన నిజం.. విడాకులు కావాలంటూ..
భర్త తనంత చదువుకోలేదని అతడి నుంచి విడాకులు కోరింది భార్య. 12వ తరగతి మాత్రమే చదివాడని.. అతడి నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. రెండేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించుకుని.. పారిపోయి వివాహం చేసుకున్న వారు కావడం గమనార్హం.
భర్త నుంచి ఇలా విడాకులు కోరిన మహిళ.. అలీగఢ్ జిల్లా అట్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోంది. రెండేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించింది. అనంతరం ఇంట్లో నుంచి అతడితో పారిపోయి గుళ్లో పెళ్లి చేసుకుంది. ఆర్ట్స్‌లో మాస్టర్స్ చదివింది ఆ మహిళ. పెళ్లైన రెండేళ్ల తరువాత భర్త చదువుపై ఆమెకు అనుమానం వచ్చింది. విషయంపై భర్తను ఆరా తీయగా తాను 12వ తరగతి మాత్రమే చదివినట్లుగా తెలుసుకుంది. దీంతో భర్త నుంచి విడిపోవాలని నిశ్చయించుకుంది. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. మహిళకు నచ్చజెప్పేందుకు భర్త, కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
"నేను ఆమె సమస్యను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేశాను. ఆయినా ఆ మహిళ భర్త నుంచి తనకు విడాకులు కావాలనే పట్టుబట్టింది. భర్త తనంత చదువుకోనందునే ఆమె విడాకులు కోరుతోంది. నేను కౌన్సెలింగ్‌తోనే సమస్యను పరిష్కరించాలి అనుకున్నాను. కానీ అది జరగలేదు." అని కౌన్సిలర్ యోగేష్ సరస్వత్ తెలిపారు. ఇరువురి వాదనలను కోర్టు రికార్డ్ చేసుకుందన్నారు యోగేష్. త్వరలో వీరిద్దరూ చట్టపరంగా విడాకులు పొందే అవకాశముందని చెప్పారు.