పిల్లల్ని చూడడానికి అనుమతించలేదని భార్య ఇంటికి నిప్పుపెట్టాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగింది. దొడ్డబీకనహళ్లి గ్రామంలో రంగస్వామి, గీత దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. అయితే ఈ దంపతులిద్దరి మధ్య ఆస్తి కారణంగా వివాదం నడుస్తోంది. ఒకరిపై ఒకరు గోరూరు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు. దీంతో నాలుగు నెలలుగా విడిగా ఉంటున్నారు. కాగా రంగస్వామీ తరచూ పిల్లల్ని చూడటానికి గీత ఉంటున్న ఇంటికి వస్తుండేవాడు. అలాగే శుక్రవారం కూడా వచ్చాడు. కానీ పిల్లల్ని చూడటానికి గీత అంగీకరించలేదు. అనంతరం కోపోద్రిక్తుడైన రంగస్వామి.. అర్ధరాత్రి వేళ తన భార్య పిల్లలు పడుకున్న సమయంలో పెట్రోల్‌తో ఇంటికి నిప్పంటించాడు. ఇది గమనించిన స్థానికులు గీతతో పాటు ఇద్దరు పిల్లల్ని రక్షించారు. మంటల్లో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు రంగస్వామిని అరెస్టు చేశారు.
లోకో పైలట్లు దుర్మరణం..
రైలు ఢీకొని ఇద్దరు లోకోపైలట్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని జంషెద్‌పుర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకోపైలట్ డీకే సహాన (53), అసిస్టెంట్ లోకోపైలట్ మహ్మద్ అఫ్సర్ ఆలమ్(36) చక్రధర్‌పుర్ రైల్వే డివిజన్లో పని చేస్తున్నారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి గూడ్స్ రైలు ఇంజిన్ మార్చడానికి కిందికు దిగారు. ఈ క్రమంలోనే మరో ట్రాక్‌పై వేగంగా వస్తున్న హౌరా-ముంబయి మెయిల్ వారిని ఢీకొంది. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వేసిబ్బంది.. చక్రధర్‌పుర్ రైల్వే ఆస్పత్రికి తరలించారు.