ఝార్ఖండ్‌లోని జంషెద్‌పుర్‌లో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. అనంతరం భర్త మృతదేహాన్ని ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన రావడం వల్ల స్థానికులు.. ఉలిదిహ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితురాలిని పోలీసు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని ఇలిదిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాశ్ కాలనీకి చెందిన అమర్నాథ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అమర్నాథ్ సింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆయన భార్య మీరా మానసిక స్థితి సరిగా లేదు. అమర్నాథ్, మీరాకు తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో చాలా సార్లు మీరా.. ఇంట్లోని వస్తువులను బయటకు విసిరేసేది. అయితే ఇటీవల అమర్ ఇంటి నుంచి దుర్వాసన రావడం వల్ల ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దీంతో స్థానికులు అమర్నాథ్ ఇంటికి వెళ్లారు. అమర్ గురించి అతడి భార్య మీరాను ప్రశ్నించారు. అయితే మీరా.. ఇరుగుపొరుగు వారికి సరైన జవాబు చెప్పలేదు. అమర్ గురించి అడిగిన వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనుమానం వచ్చిన స్థానికులు పుణెలో ఉంటున్న అమర్నాథ్ కుమారుడికి ఫోన్లో విషయం తెలియజేశారు. ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి రాకుండా మీరా ఇంటి కంచెకు కరెంట్ పెట్టింది.