ఆస్తి కోసం భర్తను దారుణంగా కడతేర్చింది ఓ భార్య. క్రైమ్ సీరియల్ చూసి.. అందులోని ఓ సన్నివేశం ఆధారంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. తొలుత భర్తను తీవ్రంగా కొట్టించి ఆసుపత్రిలో చేర్పించింది. అతడు కోలుకున్న తర్వాత డాక్టర్ రాసిన మందులను అధిక డోస్‌లతో ఇచ్చి కడతేర్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ దారుణ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన రిషబ్, స్పప్న భార్యాభర్తలు. వీరిద్దరు కల్యాణ్పుర్లో నివాసం ఉంటున్నారు. నవంబర్ 27న తన స్నేహితుడు మనీశ్‌తో కలిసి ఓ పెళ్లికి వెళ్లాడు రిషబ్. అనంతరం తిరిగి వస్తుండగా.. కొందరు వ్యక్తులు రిషబ్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు.. చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కొన్నిరోజులకు కోలుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. డిసెంబర్ 3న మళ్లీ అతడి ఆరోగ్యం క్షీణించింది. మరోసారి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు రిషబ్.
అనంతరం భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది స్వప్న. తన భర్త మరణంపై అనుమానాలున్నాయని విచారణ జరిపించాలని కోరింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రిషబ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికలో మందులు ఎక్కువ డోస్‌లో తీసుకోవడం వల్లే చనిపోయాడని తేలింది.
స్పప్నపైనే అనుమానంతో విచారణ చేసిన పోలీసులు.. మొబైల్ ఫోన్ ఆధారంగా నిజనిజాలు రాబట్టారు. రిషబ్ భార్యనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా వారు తేల్చారు. తన ప్రియుడు రాజుతో కలిసి.. స్పప్న తన భర్తను చంపేందుకు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు నిర్ధరించారు. భర్తను కొట్టించి చంపించేందుకు ప్రయత్నించగా చికిత్స పొంది బతికాడని, అనంతరం అధిక మోతాదులో మందులు ఇచ్చి చంపినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
తన భర్త పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయని, వాటి గురించి అడిగినప్పుడల్లా విషయం దాటవేసేవాడని స్పప్న తెలిపింది. ఆస్తి తనకు ఇవ్వకుండా మరెవరికైనా ఇస్తాడేమోనని భావించి రిషబ్‌ను ఆమె చంపినట్లు ఒప్పుకుంది.