ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన ప్రియుడితో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్తనే హతమార్చింది. అనంతరం ప్రియుడి ఇంటిలో గొయ్యి తీసి భర్త మృతదేహాన్ని పాతిపెట్టేసింది. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులకు తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తప్పుదోవ పట్టించింది. 2018లో జరిగిందీ దారుణం. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆ తర్వాత ఈ కేసును గాజియాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. వారు ఈ కేసును ఛేదించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు చంద్రవీర్ సింగ్ 2018 ఆగస్టు 5న హత్యకు గురయ్యాడు. తన భర్త కిడ్నాప్ అయ్యాడని బాధితుడి భార్య గాజియాబాద్ పోలీసులకు చెప్పడం వల్ల ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడం వల్ల గాజియాబాద్ క్రైమ్ పోలీసులకు ఈ కేసును అప్పగించారు.
మృతుడి భార్యను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి గొయ్యిలో పూడ్చిపెట్టినట్లు నిందితురాలు ఒప్పుకుంది. హత్యానంతరం మృతుడి చేతికి ఉన్న బంగారు ఉంగరం తీయలేక.. అతడి చేతిని సైతం నరికేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. బాధితుడి మృతదేహాన్ని గొయ్యిలో నుంచి వెలికితీసి.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. బాగా కుళ్లిన స్థితిలో మృతదేహం ఉందని తెలిపారు.