దిల్లీలో ఆస్తి కోసం ఓ వృద్ధురాలు తన భర్తను చంపడానికి ప్రయత్నించింది. ఓ వృద్ధ దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా ఇల్లు అమ్మే విషయంలో గొడవ చెలరేగింది. అయితే భర్త నిద్రిస్తున్న సమయంలో అతని భార్య కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ దారుణం నవంబర్ 21న జరగగా.. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేయడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.
ఆస్తి కోసం 72 ఏళ్ల భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భార్య! - దిల్లీలో ఆస్తి వివాదం కేసు
దిల్లీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఆస్తి కోసం ఓ వృద్ధురాలు తన భర్తను చంపడానికి ప్రయత్నించింది. ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగగా.. భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దిల్లీలోని ఓ 72 ఏళ్ల వృద్ధుడిపై అతని భార్య కిరోసిన్ పోసి నిప్పంటించింది. నార్త్ వెస్ట్రన్ జిల్లాలోని షాలీమార్బాగ్ ప్రాంతంలో ఓ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. అదే ఇంట్లోని పై భాగంలో వారి కుమారుడు, కోడలు ఉంటున్నారు. అయితే గత కొంత కాలంగా వారి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరిగేవి. వారికి ఉన్న ఇళ్లలో ఒకదాన్ని అమ్మి.. బల్లభ్గడ్ ప్రాంతంలో మరో ఆస్తిని కొనుగోలు చేశాడా వృద్ధుడు. కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తిని తన పేరున రిజిస్టర్ చేయాలని అతని భార్య కోరింది. అందుకు నిరాకరించిన వృద్ధుడు తన పేరుపై ఆ ఆస్తిని రిజిస్టర్ చేయించుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది.
నవంబర్ 21వ తేదీన.. ఆ 70 ఏళ్ల వృద్ధురాలు స్థానికంగా జరిగే తన బంధువుల వివాహానికి హాజరై.. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తన ఇంటికి చేరుకుంది. పెళ్లి నుంచి వచ్చిన తర్వాత కూడా వారి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ వృద్ధురాలు పై ఇంట్లో ఉండే.. తన కొడుకు వద్దకు వెళ్లింది. ఆ వృద్ధుడు మాత్రం కింద ఇంట్లోనే నిద్రించాడు. అయితే భర్తపై ఉన్న కోపంతో అతను నిద్రిస్తున్న సమయంలో కిరోసిన్ పోసి నిప్పింటించిందా వృద్ధురాలు. దీంతో అతను గట్టిగా అరవగా పై ఇంట్లో ఉన్న కొడుకు, కోడలు కిందకు వచ్చి.. వృద్ధుడ్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడి శరీరం 85 శాతం కాలినందున మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఆ తర్వాత అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని వారి కుమారుడు తెలిపాడు. ప్రస్తుతం ఆ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉందని.. అదనపు డీసీపీ అపూర్వ గుప్తా తెలిపారు. వృద్ధుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అతని భార్యపై.. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.