చర్మం నల్లగా ఉందని వేధించడం క్రూరత్వం కిందకే వస్తుందని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్‌కు విడాకులు మంజూరు చేసింది. పిటిషనర్ భార్య అతడి చర్మ రంగు గురించి నిరంతరం అవహేళన చేస్తూ వేధించిందని హైకోర్టు పేర్కొంది. దీన్ని కప్పిపుచ్చేందుకు పిటిషనర్‌పై తప్పుడు ఆరోపణలు మోపిందని పేర్కొంది. ఇది క్రూరత్వం కిందకే వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.
కేసు ఇదీ..
పిటిషనర్‌కు 2007లో వివాహం జరిగింది. 2012లో విడాకుల కోసం అతడు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు 2017 జనవరి 13న తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ అతడు హైకోర్టుకు వెళ్లాడు. వివాహం జరిగినప్పటి నుంచి తన భార్య తనను నల్లగా ఉన్నాడని చెప్పి వేధిస్తోందని పిటిషన్లో పేర్కొన్నాడు. తన కుమార్తె కోసం ఇంతకాలం అవన్నీ భరించానని చెప్పుకొచ్చాడు. కానీ, 2011లో తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులపై తన భార్య కేసు వేసిందని తెలిపాడు. ఈ కేసు విషయంలో తాను అనేక బాధలు అనుభవించానని చెప్పాడు. 10 రోజులు పోలీస్ స్టేషన్లో గడిపానని, కోర్టుల చుట్టూ తిరిగానని వివరించాడు. 'నా భార్య వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. నేను పనిచేసే చోట యజమానికి కూడా ఫిర్యాదు చేసింది. నేను చాలా మానసిక వేదనకు గురయ్యా' అని తన పిటిషన్లో వివరించాడు. తనకు విడాకులు మంజూరు చేయాలని అభ్యర్థించారు.