తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేయడం చూస్తుంటాం. కానీ కొడుకే తన తల్లికి పెళ్లి చేయడం ఎక్కడా చూసుండం కదా. కానీ మహరాష్ట్రలో ఓ యువకుడు.. కన్నతల్లికి రెండో పెళ్లి చేసి గొప్ప మనసును చాటుకున్నాడు. సమాజంలో భర్తను కోల్పోయిన మహిళ అంటేనే వేరే భావనతో ఉంటారు. పెళ్లిలు, పేరంటాలలో పాలుపంచుకోడానికే ఉండదు. కొంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. భర్తను పోగొట్టుకుని తల్లి అనుభవించే బాధను అర్థం చేసుకున్నాడు. తనకో తోడునివ్వాలి అనుకున్నాడు ఆ యువకుడు. దాంతో కన్న తల్లికి రెండో పెళ్లి చేశాడు. మరి వారి కథేంటో తెలుసుకుందాం.
అసలు కథ ఏంటంటే
మహారాష్ట్ర కొల్హాపుర్కు చెందిన యువరాజ్ షేలే(23) చిన్న వయస్సులోనే తన తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి అతడి తల్లి ఒంటరిగానే జీవిస్తోంది. నాటి నుంచి షీలేనే కుటుంబ బాధ్యతలు అన్నీ చూస్తున్నాడు. కానీ తన తల్లికి ఒక తోడు అవసరమని గ్రహించాడు. తన తండ్రి మరణంచిన నాటి నుంచి ఆమె ఇంట్లోనే ఒంటరితనాన్ని అనుభవిస్తూ జీవిస్తోంది. పొరుగువారితో కూడా ఎలాంటి సంబంధాలు లేకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉండటం ఆ యువకుడి మనసును కలిచి వేసింది. ఆమె బాధను తొలగించాలనే ఉద్దేశంతో రెండో పెళ్లి చేయాలనుకున్నాడు.
"మా అమ్మనాన్నలు పెళ్లి చేసుకుని దాదాపుగా 25 సంవత్సరాలు అవుతుంది. ఒక మగాడు భార్యను కోల్పోతే.. అతడు రెండో పెళ్లి చేసుకోవడం సహజం అని సమాజం ఆలోచిస్తుంది. దానిని సాధారణ విషయంగా జనాలు అనుకుంటారు. అదే మహిళల విషయానికొస్తే ఎందుకని సమాజం అలా ఆలోచించదో అర్థం కాదు. కానీ కన్న తల్లి బాధను ఒక మనిషిగా ఆలోచించగలిగాను. తన జీవితం ఇలా ఒంటరితనంతో ఇంట్లోనే మగ్గిపోవాలి అనుకోలేదు. మళ్లీ పెళ్లి చేసుకోమని అమ్మను ఒప్పించాలని నిర్ణయించుకున్నాను."
--యువరాజ్ షేలే, కుమారుడు