తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏమిటీ 'అగ్నిపథ్​'? వారి నుంచి ఎందుకింత వ్యతిరేకత?

త్రివిద దళాల నియామక ప్రక్రియలో 'అగ్నిపథ్' పేరుతో ఇటీవల కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. నూతన పద్ధతిలో ప్రతి బ్యాచ్​లో 45వేల మంది యువతను తీసుకోనున్నారు. అయితే ఇందులో 25శాతం మందికే శాశ్వతంగా సైన్యంలో సేవలందించే అవకాశం ఉంటుంది. దీంతో దేశవ్యాప్తంగా యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యూపీ, బిహార్, తెలంగాణలో ఆందాళనకారులు విధ్వంసం సృష్టించారు. రైళ్లకు నిప్పంటించి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పాత పద్ధతిలోనే సైన్యంలో నియామక ప్రక్రియ చేపట్టాలని, కొత్త విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా అగ్నిపథ్ పథకం వల్ల నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందా? సైన్యం బలహీన పడుతుందనే ఆరోపణల్లో వాస్తవమెంత? కేంద్రం ఏం చెబుతోంది? మాజీ సైన్యాధికారులు దీనిపై ఏమంటున్నారు? ఇప్పుడు చూద్దాం..

Why Violence protests against Agnipath
ఏమిటీ 'అగ్నిపథ్​' పథకం? యువత నుంచి ఎందుకింత వ్యతిరేకత?

By

Published : Jun 17, 2022, 3:48 PM IST

Updated : Jun 17, 2022, 4:14 PM IST

Agnipath Scheme: భారత సైనిక దళాల నియామకాల్లో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతూ ఇటీవలే 'అగ్నిపథ్' పేరుతో షార్ట్ సర్వీస్ అనే కొత్త విధానాన్ని ప్రకటించింది కేంద్రం. త్రివిధ దళాల్లో చేరాలనుకునే యువత కోసం ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పింది. భారతీయ సైనిక దళాలను ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావించింది. షార్ట్ సర్వీస్ పద్ధతి ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, భారతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లభిస్తారని మోదీ సర్కారు అభిప్రాయపడింది. కొత్త విధానం ద్వారా నియామకాల కోసం టూర్‌ ఆఫ్‌ డ్యూటీ పేరుతో ప్రత్యేక ర్యాలీలు చేపడతారు. వచ్చే మూడు నెలల్లో తొలి ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రతి బ్యాచ్​లో 45వేల మందిని తీసుకోనున్నారు.

'అగ్నిపథ్'​ నియామకం.. ఉద్యోగం ఇలా..

  • త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.
  • కొత్త విధానం వల్ల భారత సైనిక దళాల్లో ఎక్కువ భాగం యువత ఉండే అవకాశం ఉంటుంది.
  • అగ్నిపథ్ విధానం కింద త్రివిధ దళాల్లో నియామకాలను షార్ట్‌టర్మ్, ఒప్పంద ప్రాతిపదికన చేపడతారు.
  • 'అగ్నిపథ్' విధానం ద్వారా నియామకమైన వారి సర్వీసు నాలుగేళ్లు ఉంటుంది.
  • 90 రోజుల్లో తొలి బ్యాచ్‌ నియామకం చేపట్టనున్నారు. అందులో దాదాపు 45వేల మందికి అవకాశం కల్పించనున్నారు.
  • ఎంపికైన వారికి ఆరునెలలు శిక్షణ ఇస్తారు. మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగిస్తారు.
  • అగ్నిపథ్‌లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు ఇస్తారు.
  • సర్వీసు కాలంలో రూ.30వేల నుంచి రూ.40వేల వరకు వేతనం, ఇతర ఇతర సదుపాయాలు అందిస్తారు.
  • సర్వీసులో మెరుగైన ప్రతిభ చూపినవారికి సేవాపతకాలు లభిస్తాయి.
  • పనిచేసిన కాలానికి వేతనం నుంచి 30 శాతాన్ని సేవా నిధి ప్యాకేజీ కింద తీసుకుంటారు. దీనికి సమానంగా కేంద్రం తన వంతు జమచేస్తుంది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం ఏక మొత్తంగా రూ. 11.71 లక్షల నిధి(పన్ను మినహాయింపుతో) అందిస్తుంది. బ్యాంకు నుంచి రూ.16.5 లక్షల రుణ సదుపాయం కల్పిస్తుంది. దీంతో పాటు సర్వీసులో రూ.48లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది.

నాలుగేళ్లు పూర్తయ్యాక ఏం చేయాలంటే?
నాలుగేళ్ల ఆర్మీ సర్వీసు పూర్తయ్యాక.. ప్రతిభ చూపిన వారిలో 25 శాతం మందికి.. మెరుగైన ప్యాకేజీతో పాటు.. శాశ్వత కమిషన్‌లో అవకాశం దక్కుతుంది. నాలుగేళ్ల సర్వీసు పూర్తైన వారు.. స్వచ్ఛందంగా కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపికలు ఆటోమేటెడ్‌ పద్ధతిలో జరుగుతాయి. ఎంపికైన వారందరికీ రెగ్యులర్‌ కేడర్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది. శాశ్వత కమిషన్‌కు ఎంపిక కాని వారు.. పదవీ విరమణ తరువాత ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీసు తర్వాత అగ్నివీర్‌ స్కిల్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేస్తారు.

'అగ్నిపథ్' విధానం ఎందుకు తీసుకొచ్చారు?
త్రివిధ దళాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ అగ్నిపథ్‌ సర్వీసును కేంద్రం తీసుకొచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రక్షణ రంగ బడ్జెట్ రూ.5 లక్షల 25వేల 166కోట్లు. అందులో పెన్షన్ల వాటా రూ.లక్షా 19వేల 696 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 33వేల కోట్లుగా ఉంది. రక్షణ రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్‌లో దాదాపు సగానికి పైగా వేతనాలు, పింఛన్లకే సరిపోతోంది. అయితే అగ్నిపథ్‌లో చేరి నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత.. వారికి ఎలాంటి పింఛను సదుపాయం ఉండదు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖకు కొంత మేర ఆర్థిక భారం తగ్గనుంది. మిగులు నిధులతో త్రివిధ దళాల ఆధునికీకరణకు వెసులుబాటు లభించనుంది.

వయోపరిమితి పెంపు
అగ్నిపథ్​ విధానంలో మొదట అభ్యర్థుల వయోపరిమితిని 17.5 నుంచి 21 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే కొవిడ్‌ కారణంగా గత రెండేళ్ల నుంచి సైనిక నియమకాలు చేపట్టకపోవడంతో కేంద్రం ఈ ఏడాది కొంత సడలింపు ఇచ్చింది. 2022 నియమకాలకు సంబంధించి అర్హతను గరిష్ఠంగా 23 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

"అగ్నిపథ్‌ పథకం దేశ రక్షణ వ్యవస్థలో భాగం కావడానికి, దేశ సేవ చేయడానికి యువతకు ఒక సువర్ణావకాశం. గత రెండేళ్లలో నియామకాలు చేపట్టని కారణంగా సైన్యంలో చేరాలనుకున్నవారికి అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్నివీరుల నియామకానికి ఈ ఏడాది వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు. ఈ మినహాయింపు ఒకసారికి మాత్రమే. దీనివల్ల అనేక మంది అగ్నివీరులుగా మారేందుకు అర్హత లభిస్తుంది. ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రికి యువకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెంటనే యువకులంతా అందుకు సన్నద్ధం కావాలని కోరుతున్నాను'.

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ శాఖ మంత్రి

రెండు రోజుల్లో నోటిఫికేషన్
"డిసెంబరు 2022లో మొదటి బ్యాచ్​ అగ్నివీరులకు శిక్షణ​ ప్రారంభిస్తాం. 2023 జూన్​ లేదా జులైలో వీరికి బాధ్యతలు అప్పగిస్తాం. ఈ నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్​ విడుదల చేస్తాం. త్వరలోనే రిజిస్ట్రేషన్​ మొదలైన అంశాలపై షెడ్యూల్​ ప్రకటిస్తాం."-మనోజ్​ పాండే, ఆర్మీ చీఫ్​

అగ్నివీరులకు ప్రత్యేక డిగ్రీ కోర్సు..
'అగ్నిపథ్' ద్వారా త్రివిధ దళాల్లో సేవలందించే అగ్నివీరుల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకుని మూడేళ్ల ప్రత్యేక నైపుణ్య ఆధారిత డిగ్రీ కోర్సును ప్రారంభించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ తెలిపింది. అగ్నివీరులు సైన్యంలో పొందిన శిక్షణ నైపుణ్యాలను అధికారికంగా గుర్తించనుంది. డిగ్రీ ఉత్తీర్ణతకు అవసరమయ్యే క్రెడిట్స్​లో 50శాతం ఈ నైపుణ్యాల ఆధారంగా ఇవ్వనుంది. మిగతా 50 శాతం క్రెడిట్స్​ అగ్నివీరు​లు ఎంపిక చేసుకునే కోర్సుల ద్వారా పొందాల్సి ఉంటుంది. ఇందులో ఎకనామిక్స్, లాంగ్వేజెస్​, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్​, సోషియాలజీ వంటి కోర్సులుంటాయి. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) ఈ ప్రత్యేక డిగ్రీ కోర్సును అందించనుంది. దీనికి భారత్​తో పాటు విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం గుర్తింపు ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి సైన్యం, నావికా దళం, వాయుసేనలు IGNOUతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

యువత నుంచి తీవ్ర వ్యతిరేకత ఎందుకు?
అగ్నిపథ్​ విధానంపై దేశంలోని నిరుద్యోగ యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శాశ్వతంగా సైన్యంలో చేరాలనుకునే తమ కలలను నీరుగార్చే విధంగా కేంద్రం నిర్ణయం ఉందని వారు అంటున్నారు. నాలుగేళ్ల షార్ట్ సర్వీస్ తర్వాత మళ్లీ సాధారణ నిరుద్యోగుల్లా ఇతరులతో తాము పోటీ పడాలా? ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిససనలు చేపట్టి విధ్వంసాలకు పాల్పడుతున్నారు.

రైలుకు నిప్పంటించిన ఆందోళనకారులు

ప్రత్యేకించి యూపీ, బిహార్, తెలంగాణ యువత నుంచి అగ్నిపథ్​పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆందోళనకారులు రైల్వే స్టేషన్లలోకి ప్రవేశించి రైళ్లకు నిప్పంటించారు. చాలా బోగీలను తగలబెట్టారు. రైల్వే స్టేషన్లలోని దుకాణాలను ధ్వంసం చేశారు. పోలీసులు వీరిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. బాష్పవాయువు కూడా ప్రయోగించారు. దీంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సైనిక నియామకాలు పాత పద్ధతిలోనే చేపట్టాలని, కొత్త విధానాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఆందోళనకారులు నిప్పంటించిన రైలులో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఆందోళనకారులు ధ్వంసం చేసిన దుకాణం

అగ్నివీరుల భవిష్యత్తుకు ఢోకా లేదని కేంద్రం క్లారిటీ..
అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా యువకులు, సైనిక ఉద్యోగార్థులు నిరసన వ్యక్తం చేయడంతో కేంద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఈ పథకంతో అగ్నివీరుల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని వివరణ ఇచ్చింది. 'కల్పితాలు.. వాస్తవాలు' పేరుతో విడుదల చేసిన ఈ ప్రకటనలో.. యువత అనుమానాలు నివృతి చేసేందుకు ప్రయత్నించింది.

కల్పితం: అగ్నివీరుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
వాస్తవం: అగ్నివీరులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నాలుగేళ్ల తర్వాత వారు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటే వారికి ఆర్థికసాయం లభిస్తుంది. బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. చదువు కొనసాగించాలనుకొంటే 12వ తరగతికి సమానమైన ధ్రువపత్రం ఇస్తాం. ఉద్యోగాలు చేయాలనుకొనేవారికి కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో, రాష్ట్ర పోలీసు నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తాం.

కల్పితం: సైన్యంలో యువతకు అవకాశాలు తగ్గిపోతాయి
వాస్తవం: మరింత పెరుగుతాయి. రానున్న సంవత్సరాల్లో సాయుధబలగాల్లో అగ్నివీరుల సంఖ్య మూడింతలు కానుంది.

కల్పితం: రెజిమెంట్‌ వ్యవస్థ దెబ్బతింటుంది
వాస్తవం: రెజిమెంట్‌ వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరగవు. పైగా ఉత్తమమైన అగ్నివీరులతో ఈ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. మునుపటి కంటే యూనిట్లలో సమన్వయం పెరగనుంది.

కల్పితం: సైన్యం బలహీనమవుతుంది
వాస్తవం: స్వల్పకాలిక భర్తీ ప్రక్రియ విధానం చాలా దేశాల్లో ఉంది. ఇది ఉత్తమమైన విధానమని ఇప్పటికే తేలింది. మొత్తం సాయుధ బలగాల సంఖ్యతో పోలిస్తే తొలి ఏడాదిలో ఎంపికయ్యే అగ్నివీరులు 3 శాతం మాత్రమే. మళ్లీ వారిని నాలుగేళ్ల తర్వాత పరీక్షిస్తాం. అందులో ఉత్తమమైన వారినే ఎంపిక చేస్తాం. కాబట్టి సైన్యం మరింత బలంగా తయారవుతుంది.

కల్పితం: 21 ఏళ్ల వారికి పరిపక్వత ఉండదు, విశ్వసించలేం
వాస్తవం: ప్రపంచంలో చాలా దేశాల సైన్యాలు యువతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అగ్నిపథ్‌తో సైన్యంలో అనుభవజ్ఞులతో పాటు యువత శాతమూ పెరుగుతుంది. ఈ నిష్పత్తి సగం సగం ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాం.

కల్పితం:అగ్నివీరులతో సమాజానికి ప్రమాదం.. ఉగ్రవాదులవుతారు
వాస్తవం: ఇలా అనడం భారత సాయుధ బలగాల నైతికతను, విలువలను అవమానించడమే. నాలుగేళ్లపాటు యూనిఫాం ధరించిన యువకులు జీవితమంతా దేశం కోసం కట్టుబడి ఉంటారు. ఇందులో సందేహమే లేదు.

కల్పితం: ప్రస్తుత..మాజీ సైన్యాధికారులతో చర్చించలేదు
వాస్తవం: విస్త్రతంగా చర్చించాం. మాజీ సైన్యాధికారులు చాలా మంది దీన్ని స్వాగతించారు కూడా.

ఇదీ చదవండి:అగ్నిపథ్​పై నిరసనలతో టెన్షన్​ టెన్షన్​.. భద్రత కట్టుదిట్టం.. రైళ్లు రద్దు

Last Updated : Jun 17, 2022, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details