తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో సీఎం మార్పు- అసలు కారణమిదే... - కర్ణాటకలో భాజపా

కర్ణాటకలో రాజకీయాల్లో కీలక మలుపు. రెండేళ్ల పాలన పూర్తి చేసుకుని, మూడో వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ.. ముఖ్యమంత్రి యడియూరప్పను ఆ పదవిలో నుంచి తప్పించింది భాజపా అధిష్ఠానం. అయితే.. ఇప్పటికిప్పుడు ఆయనను తప్పించడానికి దారి తీసిన పరిస్థితులేంటి? రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా ఈ నిర్ణయం తీసుకుందా?

yediyurappa
యడ్డీని భాజపా అధిష్ఠానం ఎందుకు తప్పించింది?

By

Published : Jul 26, 2021, 1:04 PM IST

కన్నడనాట యడియూరప్ప నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ.. అనూహ్యంగా ఆయనను పదవి నుంచి తప్పించింది భాజపా అదిష్ఠానం. పొంచి ఉన్న మూడోదశ కరోనా ముప్పు, యడియూరప్ప వ్యతిరేక వర్గం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

జులై 26తో కర్ణాటకలో భాజపా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో.. రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సమర్థమైన నాయకత్వం కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. అందుకే యడ్డీకి వీడ్కోలు పలికి ప్రత్యామ్నాయ నేతకు పాలనా పగ్గాలు అందించాలని నిర్ణయించింది. ఎన్నికల నాటికి నూతన ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలన్న ఆలోచనతో నాయకత్వ మార్పు చేసింది.

ఇటీవల దిల్లీకి వెళ్లిన యడియూరప్పను తక్షణమే రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే.. అందుకు కొంత సమయం కావాలని యడ్డీ కోరినట్లు చెప్పాయి. కానీ, భాజపా ఓ నెలరోజుల గడువు మాత్రమే ఇచ్చినట్లు పేర్కొన్నాయి.

అందుకే ఎక్కువ సమయం ఇవ్వలేదా?

కరోనా మూడో దశ వ్యాప్తి చెందుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. యడియూరప్పకు అధిష్ఠానం ఎక్కువ రోజుల సమయం ఇవ్వలేదు. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే.. నాయకత్వ మార్పునకు వీలుండదు. దాంతో మరో ఆర్నెళ్లు ఈ ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉంటుంది. అలా జరిగితే.. 2023 మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో సంవత్సరం మాత్రమే గడువు ఉంటుంది. ఆ సమయంలో నూతన ముఖ్యమంత్రి తన బలాన్ని నిరూపించుకోవడం, ప్రజల మనసును గెలవడం, మిగతా నేతలతో కలిసి ఎన్నికలకు వెళ్లడం ఇబ్బందిగా పరిణమిస్తుంది. అందుకే.. యడియూరప్పను భాజపా తప్పించినట్లు తెలుస్తోంది.

వయసు మరో కారణమా?

ముఖ్యమంత్రి రాజీనామాకు.. ఆయన 78 సంవత్సరాల వయసు మరో కారణంగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయన వయసు 76 సంవత్సరాలు. పార్టీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటితే ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం కావాలి. కానీ, రాష్ట్రంలో భాజపా ప్రగతికి మార్గదర్శకుడైన యడియూరప్పను అధిష్ఠానం గౌరవించింది. ఆ గౌరవంతోనే రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే షరతులు విధించింది. అయితే.. ఇప్పుడు ఆయన రెండేళ్ల పాలన పూర్తైన నేపథ్యంలో పదవి నుంచి తప్పించింది.

2011లో ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో రాజీనామా చేయాలని ఎంతో ఒత్తిడి వచ్చినప్పటికీ.. ఆయన విముఖత చూపారు. కానీ, ఆ పార్టీ సీనియర్​ నేత ఎల్​కే అడ్వాణీ ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. ఈసారి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ.. వయసు కారణంగానే రాజీనామా అంశం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

కుమారుడి భవిష్యత్తు కోసమేనా?

సీఎంగా యడియూరప్ప రాజీనామా చేసిన నేపథ్యంలో.. కర్ణాటక కేబినెట్​లో యడ్డీ కుమారుడు విజయేంద్రకు కీలక పదవి దక్కనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్రకు ఉపముఖ్యమంత్రి లేదా జలవనరులు, ఆర్థిక శాఖ, ప్రజాపనుల శాఖలో ఏదో ఒక మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. ఇటీవల దిల్లీ పర్యటనలోనూ భాజపా అధిష్ఠానంతో యడ్డీ.. తన కుమారుడి భవిష్యత్తు గురించే చర్చించారని సమాచారం. తన రాజీనామాకు బదులుగా విజయేంద్రకు ఉపముఖ్యమంత్రి పదవీ లేదా.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని యడియూరప్ప పట్టుపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు భాజపా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details