Why Should Not Travel on Kanuma Day : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండగలలో ఒకటి సంక్రాంతి. మూడు రోజుల పాటు కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల రాకతో తెలుగు లోగిళ్లు సందడిగా మారతాయి. పల్లెల్లన్నీ పండగ వాతావరణాన్ని నింపుకుంటాయి. పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పండగలో భాగంగా మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి(Sankranti 2024), మూడో రోజు కనుమ జరుపుకుంటారు. ఈ కనుమనే పశువుల పండగ అంటారు. పంట చేతికి రావడానికి తమకు ఏడాదంతా చేదోడుగా ఉన్న పాడి పశువులను ఈ రోజు ప్రత్యేకంగా అలంకరించి మంచి ఆహారం అందించి పూజిస్తారు. అదేవిధంగా పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షుల కోసం కూడా ఇంటి గుమ్మాలకు ధాన్యపు కంకులను కడతారు. అయితే, 'కనుమ నాడు కాకులు కూడా కదలవు' అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని మన పూర్వీకులు చెబుతుంటారు. అసలు ఈ సంప్రదాయ నియమం వెనుక ఉద్దేశాలు ఏంటి? నిజంగా కనుమ రోజు ప్రయాణాలు చేయొద్దా? చేస్తే ఏమవుతుందని? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Kanuma Importance :పూర్వ కాలంలో కనుమ నాడు జర్నీ చేయకూడదంటూ పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యం కూడా దాగి ఉంది. నిజానికి పూర్వం మన పెద్దవాళ్లు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఎడ్ల బండ్లను యూజ్ చేసేవారు. అయితే మూడు రోజుల సంక్రాంతి పండగలో భాగంగా కనుమ నాడు ఎడ్లను ప్రత్యేకంగా పూజిస్తారు గనక వాటిని ఆ ఒక్కరోజైనా కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో ఎడ్ల బండ్లు కట్టకుండా చూసేందుకు కనుమ రోజు ప్రయాణం వద్దని చెప్పేవారు. అందుకే నోరులేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమ పండగని భావిస్తారు. అదేవిధంగా మనిషి జీవితంలో పశు పక్ష్యాదులకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిపే పండగగా ఆ రోజును పరిగణిస్తారు.