Prez polls: సార్వత్రిక ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, ఉప ఎన్నికైనా.. సాధారణంగా వినిపించే పేరు ఈవీఎం. ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరం ఇది. 18 ఏళ్ల వయసు నిండిన వారి నుంచి వయసు మీరిన అవ్వ వరకు ఓటేయాలంటే దీన్ని వినియోగించాల్సిందే. మరి ఇలాంటి ఈవీంఎలను ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకునే రాష్ట్రపతి ఎన్నికల్లో (prez polls) ఎందుకు వాడరు?. ఈ డౌట్ మీకు వచ్చిందా? కేవలం రాష్ట్రపతి ఎన్నికలే కాదు.. రాజ్యసభ ఎన్నికల్లో గానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గానీ వీటిని ఎందుకు వాడరో చూద్దాం..
లోక్‌సభ స్థానాలకు గానీ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు గానీ అభ్యర్థులను ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. తమకు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బటన్‌ను నొక్కి ఓటు హక్కు వినియోగించుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం అలా కుదరదు. ఓటింగ్‌లో పాల్గొనబోయే వ్యక్తి తన తొలి ప్రాధాన్య ఓటుతో పాటు రెండు, మూడు ప్రాధాన్య ఓట్లను కూడా వేయొచ్చు. 1, 2, 3.. ఇలా ఎంత మంది అభ్యర్థులు ఉంటే అంతమందికీ తన ప్రాధాన్య ఓటు వేయొచ్చు. అయితే, ఈవీఎంలలో ఈ ఏర్పాటు లేదు. కాబట్టి వీటికి ప్రత్యేకంగా ఈవీఎంలు రూపొందించాలి. అందుకనే వీటిని రాష్ట్రపతి ఎన్నికల్లో వాడడం లేదు.
ఈవీఎంల వెనుక పెద్ద చరిత్రే..:మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న ఈవీఎంలకు పెద్ద చరిత్రే ఉంది. 2004 నుంచి వీటిని మనం వినియోగిస్తున్నప్పటికీ.. వీటికి 1977లోనే బీజం పడింది. ఈవీఎంలను రూపొందించాల్సిందిగా అప్పట్లోనే ఎలక్షన్ కమిషన్.. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సూచించింది. దీంతో రెండేళ్ల అనంతరం ఈసీఐఎల్ 1979లో ఈసీ ముందు దీన్ని ప్రదర్శించింది. 1980లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదించిన అనంతరం వీటి తయారీ బాధ్యతను ఈసీఐఎల్‌తో పాటు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్‌కు ఈసీ అప్పగించింది.
కేరళలో తొలిసారి..విస్తృత సంప్రదింపుల అనంతరం రూపొందిన ఈవీఎంలను కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 1982లో తొలిసారి వినియోగించారు. అయితే, ఈవీఎంల వినియోగానికి సంబంధించిన చట్టమేదీ లేకపోవడంతో ఆ ఎన్నికను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఈవీఎంల వినియోగానికి అనువుగా.. 1989లో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కు పార్లమెంట్ సవరణలు చేసింది. భాగస్వామ్య పక్షాల ఏకాభిప్రాయ సాధన అనంతరం చాలా ఏళ్ల తర్వాత 1998లో తొలిసారి మూడు వేర్వేరు రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో వీటిని వినియోగించారు. 2001 మే నెలలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో వీటిని ఉపయోగించారు. అనంతరం 2004 లోక్‌సభ ఎన్నికల నుంచి వీటిని దేశవ్యాప్తంగా వినియోగించడం ప్రారంభించారు.
ఇదీ చదవండి: