తిరువనంతపురం జిల్లాలో నెమోమ్ సీటు ఉంది. ఇక్కడ ఓటర్ల సంఖ్య దాదాపు రెండు లక్షలు. అందులో అగ్రవర్ణ హిందువులే మెజారిటీ వర్గంగా ఉన్నారు. జనాదరణ ఎక్కువగా ఉన్న 86 ఏళ్ల రాజగోపాల్‌ను భాజపా 2016 ఎన్నికల్లో ఇక్కడ బరిలో దించింది. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ల ఆధిపత్యానికి సవాలు విసురుతూ.. ఆయన విజయం సాధించారు. నాటి నుంచీ నియోజకవర్గంపై తమ పట్టును పదిలపర్చుకునేందుకు కమలనాథులు తీవ్రంగా శ్రమించారు. గుజరాత్ అభివృద్ధి నమూనాను విస్తృతంగా ప్రచారం చేశారు. తమ ఓటు బ్యాంకు నిలకడగా పెరిగిందని.. నెమోమ్‌లో ఇక తమను ఓడించడం అసాధ్యమని వారు చెబుతున్నారు. 'కేరళలోని గుజరాత్'గా ఆ స్థానాన్ని అభివర్ణిస్తున్నారు. ఇక్కడ మరోసారి విజయం సాధించి.. రాష్ట్రం నలుమూలలా పార్టీ పట్టును విస్తరింపజేయాలని వారు కృతనిశ్చయంతో ఉన్నారు.
మోదీ-షా వచ్చే అవకాశం
నెమోమ్‌లో భాజపా మళ్లీ గెలిస్తే.. కేరళ రాజకీయాల్లో కీలక మలుపుగా అది నిలవడం ఖాయం! రాష్ట్రంలో కమలదళం విస్తరణకు ఆ విజయం బాటలు పరిచే అవకాశముంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను రప్పించి నెమోమ్‌లో ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర భాజపా నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. "నెమోమ్ మా కంచుకోట. రాహుల్ గాంధీ అయినాసరే ఇక్కడ మాపై గెలవలేరు" అని కేరళ భాజపా అధ్యక్షుడు కె.సురేంద్రన్ చెబుతుండటం గమనార్హం.