తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Up election 2022: యూపీలో 'కుర్మీ' వర్గం మెప్పు పొందేదెవరు? - up bjp state president Swatantra Dev Singh

Up election 2022: ఉత్తర్​ప్రదేశ్​లో ఓబీసీ ఓట్లను ఒడిసి పట్టేందుకు పోటీ పడుతున్నాయి రాజకీయ పార్టీలు. అందులో 'కుర్మీ' సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఐదు శాతం జనాభా ఉన్న కుర్మీలకు యూపీ ఎన్నికల్లో ఎందుకింత ప్రాధాన్యం? ఎన్ని స్థానాల్లో వారి ప్రభావం ఉంటుంది? కేంద్ర కేబినెట్​ విస్తరణలో ఆ వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు కేటాయించడం వెనుక ప్రధాని మోదీ ఉద్దేశం అదేనా?

Up election 2022
యూపీలో ఎన్నికల్లో 'కుర్మీ' ఓటర్లకు ఎందుకంత ప్రాధాన్యం?

By

Published : Jan 29, 2022, 5:30 PM IST

Up election 2022: మతం.. కులం.. ఉత్తర్​ప్రదేశ్​ రాజకీయాలను శాసించేవి ఈ రెండే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో కులాల వారీగా ఓటు బ్యాంకును పోగుచేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి రాజకీయ పార్టీలు. అందులో భాగంగా యాదవేతర ఓబీసీ వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి ప్రధాన పార్టీలైన అధికార పక్షం భాజపా.. ప్రతిపక్షం సమాజ్​వాదీ పార్టీ.

ప్రధానంగా ఓబీసీ కేటగిరీలో యాదవుల తర్వాత అతిపెద్ద సామాజిక వర్గమైన 'కుర్మీ' ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నాయకులు. కుర్మీ కులస్థులను 'పటేల్' అని కూడా పిలుస్తుంటారు.

యూపీలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఓబీసీలో యాదవేతర కులాలకు ప్రాధాన్యం ఏర్పడింది. అందులో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కులస్థులను పోటీ పడి మరీ భాజపా- ఎస్పీ ప్రసన్నం చేసుకుంటున్నాయి.

ఇదివరకే కిసాన్, నౌజవాన్ పటేల్ యాత్రలు సైతం నిర్వహించింది ఎస్పీ. ఈ యాత్రలకు కుర్మీ వర్గానికి చెందిన ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ నేతృత్వం వహించారు.

భాజపా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించింది. కుర్మీ కులానికి ప్రాతినిధ్యం వహించే.. అప్నాదళ్ (ఎస్) అధినేత్రితో దోస్తీ కట్టింది కాషాయ దళం.

అలాగే రెండోసారి జరిగిన కేంద్ర కేబినెట్​ విస్తరణలో యూపీకి చెందిన ఏడుగురికి మంత్రి పదవులను కేటాయించింది మోదీ సర్కారు. అందులో ఓబీసీ కుర్మీ వర్గానికి చెందిన పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్ ఉండటం గమనార్హం.

ఇరు పార్టీల అధ్యక్షులు వారే..

కేంద్ర మాజీ మంత్రి బేణి ప్రసాద్ వర్మ మరణానంతరం ఎస్పీలో బలమైన కుర్మీ నేతలు ఎవరూ లేరు. ఈ క్రమంలో ఆ వర్గానికి చెందిన నరేష్ ఉత్తమ్ పటేల్​ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు అఖిలేశ్​ యాదవ్​. ఫలితంగా భాజపాకు అనుకూలమైన కుర్మీ ఓటర్లను.. ఎస్పీ వైపు మళ్లించుకోవచ్చని ఆ పార్టీ భావిస్తోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ కూడా కుర్మీ వర్గానికి చెందిన నాయకుడే కావడం గమనార్హం. గతంలోనూ కుర్మీలకు చెందిన ఓం ప్రకాష్ సింగ్, వినయ్ కతియార్ కూడా భాజపా రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు.

కైసర్‌గంజ్ శాసనసభ స్థానం నుంచి ఎన్నికై.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న ముకుత్ బిహారీ వర్మ కూడా కుర్మీ వర్గానికి చెందిన వారే.

⦁ యూపీలో కుర్మీ సామాజిక వర్గం జనాభా 5శాతం

⦁ 78 లోక్​సభ నియోజకవర్గాల్లో కుర్మీ ఓటర్ల ప్రభావం

⦁ 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కుర్మీ సామాజిక వర్గం

కుల సమీకరణాలు..

రాష్ట్రంలోని 45శాతం వెనుకబడిన కులాల ఓటర్లు ఉండగా.. అందులో 10శాతం మంది యాదవులు ఉన్నారు. వారిలో మెజార్టీ ఓటర్లు ఎస్పీకి మద్దతు ఇచ్చేవారే. అయితే మిగిలిన ఓబీసీ ఓట్లలో దాదాపు 35 శాతం ఓట్లను పొందగలిన పార్టీ చక్రం తిప్పే అవకాశం ఉంటుంది.

కుర్మీ సమాజిక వర్గంలో గంగ్వార్, సచన్, నానిరంజన్, కతియార్​ కులాలు కూడా అంతర్భాగం. కావాల్సిన 35శాతం ఓట్లకు ఈ వర్గాలు కీలకం కానున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి పార్టీలు.

అందులో భాగంగానే ఎస్పీ.. రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాత్రలు చేపట్టింది.

భాజపా మాత్రం వ్యూహాత్మంగా అప్నాదళ్(ఎస్)తో జతకట్టింది. అప్నా దళ్ మాజీ అధ్యక్షుడు సోనెలాల్ పటేల్.. కుర్మీ సామాజిక వర్గంలో బలమైన నేత. ఆయన మరణం తర్వాత.. ఆ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఎదిగారు అప్నాదళ్ (ఎస్) అధినేత్రి అనుప్రియ పటేల్‌.

ప్రయాగ్‌రాజ్ మండల్ చుట్టుపక్కల జిల్లాల్లో అనుప్రియ పటేల్ అప్నా దళ్ (ఎస్)కు గట్టి పట్టు ఉంది. ఇక్కడ కుర్మీ ఓటర్లు ఎక్కువ శాతం ఉండటం వల్ల.. గెలుపోటములను శాసించే శక్తి వారికి ఉంది. ఇది కలిసొస్తుందనే ఉద్దెశంతోనే భాజపా.. అనుప్రియతో దోస్తి కట్టిందని, కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మారిన పరిస్థితులు

యూపీలో 2017కు ముందు ఉన్న రాజకీయాలకు.. తర్వాత రాజకీయాలకు చాలా తేడా ఉందన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ దిలీప్ అగ్నిహోత్రి. భాజపా అధికారంలోకి రాక ముందు ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు దాదాపు దశాబ్దంన్నర పాటు ఎస్పీ, బీఎస్పీ ఆధిపత్యంలో ఉండేవి. తర్వాత భాజపా అధికారంలోకి రావడం వల్ల కుల సమీకరణాలు మొత్తం మారిపోయాయి.

2017లో.. వెనుకబడిన కులానికి చెందిన ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య నాయకత్వంలో భాజపా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది. ఈసారి కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తోంది భాజపా. అందుకే ఈసారి కుర్మీ నేత స్వతంత్రదేవ్ సింగ్‌ను భాజపా అధ్యక్షుడిని చేసింది.

బిహార్​లో కుర్మీ వర్గానికి చెందిన నితీష్ కుమార్​ను తమ పార్టీ ముఖ్యమంత్రిని చేసిందనే అంశాన్ని భాజపా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

"భాజపా నితీష్ కుమార్​ను ముఖ్యమంత్రిని చేసినా.. గుజరాత్‌లో పటేల్ జీ పేరుతో విగ్రహాన్ని నిర్మించినా.. ప్రజలు అనుకున్న వారికే ఓటు వేస్తారు"

-డాక్టర్ దిలీప్ అగ్నిహోత్రి, రాజకీయ విశ్లేషకుడు

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో 5శాతంగా ఉన్న కుర్మీ సామాజిక వర్గం ఓటర్లు గత ఎన్నికల్లో భాజపాకు మద్దతుగా నిలిచారని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈసారి సమాజ్​వాదీ పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న నేపథ్యంలో వారు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆకసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: పంచతంత్రం: పంజాబ్​లో 'దళితుల' కటాక్షం దక్కేదెవరికి?

ABOUT THE AUTHOR

...view details