Why January 22nd is for Ram Lalla Pran Pratishtha In Ayodhya:అయోధ్యలోరామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు రామమందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయితే.. ఈ ముహుర్తాన్నే ఎందుకు నిర్ణయించారో మీకు తెలుసా? దీనికి ఓ బలమైన కారణం ఉంది! ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
శ్రీరాముని జన్మ సమయంలో ప్రాణ ప్రతిష్ఠ:హిందూ పురాణాల ప్రకారం, శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అభిజిత్ ముహూర్తం జనవరి 22వ తేదీన ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. ఈ కారణంగానే.. జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి నిర్ణయించారు.
భారీ భూకంపాలను తట్టుకునేలా అయోధ్య రామాలయ నిర్మాణం - డిజైన్లలో హైదరాబాదీ ప్రొఫెసర్ కీ రోల్
త్రిపురాసురుడి సంహారం: హిందూ శాస్త్రాల ప్రకారం.. ఈ అభిజిత్ ముహూర్తంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని చంపాడని చెబుతారు. అందువల్ల ఈ ముహూర్తం శత్రువుల పతనానికి శుభప్రదమైనదని.. ఈ సమయం ఎల్లప్పుడూ విజయాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. అందువల్ల.. ఈ ముహూర్తం వ్యాపారం, పని, ఆర్థిక పెట్టుబడులు, గృహ ప్రవేశం, వేడుక మొదలైన శుభ కార్యక్రమాలకు మంచిదని భావిస్తారు.
మృగశిర నక్షత్రం:ఇక మరో బలమైన కారణం మృగశిర నక్షత్రం.జనవరి 22వ తేదీ సోమవారం మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3.52 గంటలకు ప్రారంభమై.. జనవరి 23 మంగళవారం ఉదయం 4:58 వరకు ఉంటుంది. ఇది కూడా చాలా శుభప్రదమైన సమయంగా భావిస్తారు. ఎందుకంటే హిందూ పంచాగ ప్రకారం.. మృగశిర నక్షత్రం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నక్షత్రం సోమ దేవతతో సంబంధం కలిగి ఉంటుంది. సోమదేవతను అమరత్వం గల దేవుడు అని పిలుస్తారు. ఈ నక్షత్రం జ్ఞానం, అనుభవం సాధనను సూచిస్తుంది. అందుకే మృగశిర అత్యంత పవిత్రమైన నక్షత్రంగా పరిగణించబడుతుంది. ఈ శుభ ఘడియలో ఏదైనా పని చేస్తే అందులో మంచి జరుగుతుందని నమ్మకం.