2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది దిగ్గజ ఎంజీఆర్ పేరిట ఉన్న రికార్డును తిరిగరాయాలనుకున్న అన్నాడీఎంకే ఆశలు.. ఆశలుగానే మిగిలిపోయాయి. వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టి రాష్ట్రాన్ని పాలిద్దామనుకున్న పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. 10ఏళ్ల పాటు అధికారంలో ఉంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎదురవడం సహజం. కానీ ఈ దఫా ఎన్నికలను పరిశీలిస్తే.. అన్నాడీఎంకేపై ప్రజల్లో ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో విస్పష్టంగా బయటపడుతోంది. మరి అన్నాడీఎంకే ఇంత దారుణంగా ఓటమి పాలవడానికి కారణాలేంటి? ఇందులో పళనిస్వామి-పన్నీర్‌సెల్వం పాత్ర ఎంత?
నాయకత్వ లేమి!
జయలలిత దూరమైనప్పటి నుంచి అన్నాడీఎంకేను నాయకత్వ లేమి సమస్య వెంటాడుతోంది. జయలలిత మరణాంతరం పగ్గాలు చేపట్టిన పళనిస్వామి.. చివరి వరకు నిలవగలరా? అన్న అనుమానం మధ్యే పాలన కొనసాగించారు. పన్నీర్ సెల్వంతో ఉన్న విభేదాలే ఇందుకు కారణమన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. వీరి వల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయని అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.
కానీ పూర్తి స్థాయిలో ఐదేళ్ల పాలన పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు పళనిస్వామి. తాము చేసిన అభివృద్ధి ఈసారీ ఓట్లు తెచ్చిపెడుతుందని భావించారు. కానీ ప్రజలు డీఎంకే పక్షాన నిలిచారు.
శశికళ ఎఫెక్ట్!
అన్నాడీఎంకేలో చీలికలు కూడా ఆ పార్టీకి చేటు చేశాయన చెప్పుకోవాలి. చిన్నమ్మ శశికళ పార్టీని వీడటం ప్రతికూలంగా మారింది. ఆమె అభిమానుల నుంచి పార్టీకీ వ్యతిరేకత ఎదురైంది. చివరికి.. అందరం కలిసి ముందుకు వెళదాం అని స్వయంగా శశికళ చెప్పినా.. ఫలితం దక్కలేదు.
అటు టీటీవీ దినకరన్ విడిగా పోటీ చేయడం, విజయ్‌కాంత్ పార్టీ కూడా అన్నాడీఎంకే నుంచి దూరం జరగడం.. ప్రతికూల విషయాలు. ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు చీల్చిన అంశాలే.