భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ అరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి అత్యవసర వినియోగ అనుమతులు లభించడంతో భారతీయుల విదేశీ ప్రయాణాలు సులభతరం కానున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 96 దేశాలు.. డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదిత వ్యాక్సిన్లు వేసుకున్న విదేశీయులను తమ దేశాల్లోకి అనుమతిస్తున్నాయని తెలిపింది. అవన్నీ కొవాగ్జిన్‌ను గుర్తించడం లాంఛనమేనని అభిప్రాయపడింది.
కొన్ని దేశాలు మాత్రం ఆయా టీకాలకు విడిగా అనుమతులు మంజూరు చేస్తున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. కొవాగ్జిన్ విషయంలో అలాంటి దేశాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ టీకాకు గుర్తింపునిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశాయని తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి దిల్లీలో గురువారం ఈ మేరకు విలేకర్ల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు.