President Election: రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అత్యున్నతమైన ఆ పీఠంపై తాము కోరుకున్న వ్యక్తిని కూర్చోబెట్టేందుకు అధికార, విపక్షాలు పావులు కదుపుతున్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన మెజార్టీ అధికార ఎన్డీయేకు సొంతంగా లేదు. కూటమికి ఇంకా కావాల్సిన ఓట్ల సంఖ్య తక్కువే. ఉమ్మడిగా కలిసి నడిస్తే విపక్షాలు విజయతీరాలకు చేరుకోగలవు. ఈ నేపథ్యంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
ఎన్నిక ఎలా?:రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఇందులో సభ్యులే. అయితే వారందరి ఓటు విలువ సమానంగా ఉండదు. ఒక్కో ఎంపీ ఓటు విలువ (లోక్‌సభ అయినా, రాజ్యసభ అయినా) 708 పాయింట్లుగా ఉంటుంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎమ్మెల్యేల ఓటు విలువ.. అక్కడి జనాభా (1971 నాటి జనగణన ప్రకారం) ఆధారంగా లెక్కలోకి వస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా, కొన్ని చిన్న రాష్ట్రాల్లో అది 30 కంటే తక్కువగా కూడా ఉంది.
2017లో ఏం జరిగింది?:గత ఎన్నికల సమయానికి దేశంలో భాజపా ప్రభంజనం కొనసాగుతోంది. అప్పటికి 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్డీయే అధికారంలో ఉంది. ఫలితంగా కూటమి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ఎలక్టోరల్ కాలేజీలో 65.65% ఓట్లు దక్కించుకొని ఘన విజయం సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్ 34.35% ఓట్లకు పరిమితమయ్యారు. కానీ ఈసారి లెక్క మారనుంది.
ఇప్పుడు ఎవరి బలమెంత?:2017తో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు చాలా మారాయి. ఎన్డీయే 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో పరిపాలనా పగ్గాలు కోల్పోయింది. తెదేపా, శివసేన, అకాలీదళ్ తదితర మిత్రపక్షాలు దూరమయ్యాయి. ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే ఓట్ల విలువ 48.9%గా ఉంది. విపక్షాల మొత్తం బలం 51.1%. ఎన్నికల్లో గెలవాలంటే ఎన్డీయేకు మరో 1.1% కంటే కొన్ని ఎక్కువ ఓట్లు సరిపోతాయి. ప్రతిపక్షాలు మాత్రం దాదాపుగా అన్నీ ఒక్కటైతేనే తమ అభ్యర్థిని గెలిపించుకోగలుగుతాయి.
మారనున్న లెక్కలు:రాష్ట్రపతి ఎన్నికలు జులైలో జరగనున్నాయి. ఆ లోపు 52 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వాటి ఫలితాలు ఎలక్టోరల్ కాలేజీలో బలాబలాలపై ప్రభావం చూపుతాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, తమిళనాడుల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో.. ఎగువ సభలో కూటమి సభ్యుల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయి. యూపీ నుంచి మాత్రం భాజపా రాజ్యసభ ఎంపీల సంఖ్య కొంత పెరుగుతుంది. మరోవైపు- పెద్దల సభలో కాంగ్రెస్ బలం తగ్గే అవకాశముంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీల బలం పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలో ఈ దఫా రాష్ట్రపతి ఎన్నికలు గతంలో తరహా ‘భాజపా వర్సెస్ కాంగ్రెస్’గా కాకుండా.. ‘భాజపా వర్సెస్ ప్రాంతీయ పార్టీలు’గా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పార్లమెంటులో ఎన్డీయేదే పైచేయి:ఉభయసభల్లో కలిపి ఎన్డీయే ఎంపీల సంఖ్య 442. ఎలక్టోరల్ కాలేజీలో వారి బలం 3,12,936 పాయింట్లు. చిరాగ్ పాస్వాన్‌పై తిరుగుబావుటా ఎగరేసిన లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఎంపీలు ఐదుగురు ఈ కూటమి వైపు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలైన ఎన్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, ఐయూఎంఎల్, వాటితో స్నేహపూర్వకంగా మెలిగే మరికొన్ని పక్షాలకు కలిపి 136 మంది ఎంపీలున్నారు. వారి ఓట్ల విలువ 96,288. ఇతర పార్టీలను రెండు విభాగాలుగా వర్గీకరించొచ్చు. తొలి విభాగంలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఏఐఎంఐఎం, తెదేపా, వామపక్షాల వంటివి ఉంటాయి. ఈ పార్టీలు కాంగ్రెస్‌తో సన్నిహితంగా లేనప్పటికీ.. భాజపాకు మద్దతిచ్చే అవకాశాలూ లేవు. వీటికి 128 మంది ఎంపీలున్నారు. వీరి ఓట్ల విలువ 90,624. ‘ఇతరుల్లోని రెండో విభాగం’లో వైకాపా, తెరాస, బిజూ జనతాదళ్, కొందరు స్వతంత్ర ఎంపీలు ఉన్నారు. ఈ వర్గంలోని మొత్తం ఎంపీల సంఖ్య 67. ఓట్ల విలువ 47,436. గతంలో వీరు క్లిష్ట పరిస్థితుల్లో భాజపాకు మద్దతిచ్చిన దాఖలాలున్నాయి.
అసెంబ్లీల్లో విపక్షాల ముందంజ:అసెంబ్లీల్లో మాత్రం ఎన్డీయేపై ప్రతిపక్షాలదే పైచేయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో ప్రస్తుతం మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 4,033. ఎలక్టోరల్ కాలేజీలో వారి ఓట్ల విలువ 5,46,527. ఎన్డీయే పాలనలోని పెద్ద రాష్ట్రాలు ఆరే. కూటమి అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతంలో ఒక్కో శాసనసభ్యుడి ఓటు విలువ 30 పాయింట్ల కంటే తక్కువ. ఇది భాజపాకు పెద్ద ప్రతికూలత. ఎలక్టోరల్ కాలేజీలో యూపీ అసెంబ్లీ మొత్తం వాటా 83,824 పాయింట్లు. అందులో ఎన్డీయే బలం 67.7%. 2017లో అది దాదాపు 80%గా ఉండేది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే కూటమి బలం యూపీలో 10 వేల పాయింట్లకు పైగా తగ్గింది. 8 పెద్ద రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం ప్రతిపక్షాలకు సానుకూలాంశం.
మూడింటిలో ఒక్కటి మద్దతిచ్చినా:తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎన్డీయేకు మరో 11,990 పాయింట్లు అవసరం. వాటిని సమీకరించుకునేందుకు కమలనాథులు ముమ్మర ప్రయత్నాలు చేయడం ఖాయం. వైకాపా, తెరాస, బీజేడీల్లో ఏ ఒక్క పార్టీ మద్దతిచ్చినా.. ఎన్డీయే అభ్యర్థే రాష్ట్రపతి పీఠంపై కూర్చుంటారు. ప్రస్తుతానికి తెరాస అయితే భాజపాతో కలిసివెళ్లే అవకాశాలు కనిపించడం లేదు.
రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది? రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది? రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది? ఇదీ చదవండి:మోదీ నయా ట్రెండ్.. గురువారం ఎర్రకోట నుంచి ప్రసంగం