Gujarat elections 2022 : గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలన్నీ వ్యూహ రచనలు ప్రారంభించాయి. గుజరాత్‌లో 1995 నుంచి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. వరుస పరాజయాలకు గుజరాత్‌లో ముగింపు పలకాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. పంజాబ్ వ్యూహాన్ని అనుసరించి మోదీ ఇలాకాలో జెండా పాతాలని ఆమ్ ఆద్మీ పార్టీ పట్టుదలగా ఉంది.
గుజరాత్ శాసనసభ ఎన్నికలపై ఏబీపీ సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. గుజరాత్‌లో మరోసారి భారతీయ జనతా పార్టీనే అధికారంలోకి వస్తుందని ఈ సర్వే వెల్లడించింది. రెండో స్థానంలో ఆప్.. మూడో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తాయని తెలిపింది. 22,807 మందితో జరిపిన ప్రీ-పోల్ సర్వేలో.. అధికార భాజపాకు 56 శాతం, ఆప్‌కు 20 శాతం, కాంగ్రెస్‌కు 17 శాతం ఓట్లు రానున్నట్లు ఏబీపీ సీ ఓటర్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు.. భారీగా ఆప్ వైపు మళ్లే అవకాశం ఉందని కూడా తెలిపింది. గుజరాతీలపై ఆప్ చాలా ప్రభావం చూపనుందని కూడా సీ ఓటర్ సర్వే పేర్కొంది.
ఏబీపీ సీ ఓటర్ ప్రీ పోల్ సర్వేపై ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ స్పందించారు. తమకు ఇప్పటికే 30 శాతం ఓటు బ్యాంక్ ఉందని.. దీనిని మరింత పెంచుకుని గుజరాత్ అధికార పీఠం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఐదు కంటే తక్కువ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని విమర్శించారు. గుజరాత్‌లో ఆప్ గెలుపు తథ్యమని కేజ్రీవాల్ తెలిపారు.