సార్వత్రిక ఎన్నికలు ఎంతో దూరంలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. పేరుకు నాలుగు రాష్ట్రాలు (బంగాల్, అసోం, తమిళనాడు, కేరళ), ఒక కేంద్రపాలిత ప్రాంతం (పుదుచ్చేరి)లో అసెంబ్లీ ఎన్నికలే అయినా యావద్దేశాన్ని ఆకర్షించే రాజకీయ మసాలా వీటిలో దాగుండటమే ఇందుకు కారణం! వీటిలో పుదుచ్చేరిని కాసింత పక్కన బెడితే... మిగిలిన నాలుగు... అత్యంత ఆసక్తి రేకెత్తించేవే! జయ, కరుణల మరణంతో మారిన రాజకీయ ముఖచిత్రాలు, ఏమాత్రం తగ్గని మమత బెనర్జీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ల అస్తిత్వ పోరాటాలు, అన్ని రాష్ట్రాల్లోనూ తమ జెండా ఎగరాలని కమలనాథుల దూకుడు నేపథ్యంలో తాజా ఎన్నికలు...దేశవ్యాప్త ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
- ఐదేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఒక్కో పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అన్నింటా అధికారం కోసం ప్రయత్నించిన (బంగాల్, తమిళనాడు, కేరళల్లో పొత్తులతో కలసి) కాంగ్రెస్ పార్టీ ఒక్క పుదుచ్చేరిలో మాత్రమే అదీ డీఎంకే మద్దతుతో అధికారంలోకి వచ్చింది. అసోం, కేరళల్లో అధికారం కోల్పోయింది.
- 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత బిహార్ తప్పించి... ఝార్ఖండ్, దిల్లీ, మహారాష్ట్రల్లో ఓడిపోయి, హరియాణాలో చావుతప్పి కన్నులొట్టబోయింది భాజపా!
- కేరళ, బంగాల్, అసోంలలో కలిపి ముస్లిం ఓటర్లు 28-32 శాతం ఉంటారు.
- మోదీ ప్రభుత్వ సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల ఆందోళన, పెట్రో ధరల మంట, కొవిడ్ అనంతర పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
116 లోక్‌సభ సీట్లకు ప్రాతినిధ్యం వహించే ఈ ఐదు రాష్ట్రాల్లో పట్టు కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలకు, కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌కు ఇవి కఠిన పరీక్షలుగా నిలుస్తున్నాయి.
కామ్రేడ్ల ఆఖరి వికెట్ ఆగేనా?
బంగాల్లో మిత్రపక్షాలుగా కలసి పోటీ చేస్తున్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్... కేరళకొచ్చే సరికి బద్ధవైరులుగా మారటం రాజకీయ వైచిత్రి! 40 ఏళ్లుగా కేరళలో ఓసారి వామపక్షాల సారథ్యంలోని కూటమి (ఎల్‌డీఎఫ్) గెలిస్తే మరోసారి కాంగ్రెస్ సారథ్యంలోని (యూడీఎఫ్) కూటమి గెలుస్తోంది. మరి ఈసారి ఏమవుతుందనేది చూడాలి. గోల్డ్‌స్కాంలో ముఖ్యమంత్రి కార్యాలయంపైనే ఆరోపణలు రావటం అధికార కామ్రేడ్లకు మచ్చ! కానీ కొవిడ్, వరదల విషయంలో ప్రభుత్వం బాగానే స్పందించిందనుకుంటున్న నేపథ్యంలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది చూడాలి. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే దేశంలో కమ్యూనిస్టులు అధికారానికి పూర్తిగా దూరమైనట్లే! ఎందుకంటే ప్రస్తుతం ఇదొక్కటే కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రాష్ట్రం! కేరళలోనూ భాజపా దూసుకుపోవాలని చూస్తున్నా సందు దొరకటం లేదు. మెట్రోమ్యాన్‌గా పేరొందిన శ్రీధరన్‌ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతోంది. ఆ ఎత్తుగడ అధికారాన్ని అందించేంతగా మాత్రం ఉపయోగపడకపోవచ్చు.
ఆ ఆందోళన ప్రభావమెంత?
అసోంలో భాజపా నేరుగా కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరులో ఉంది. కాంగ్రెస్‌ను ఓడించి 2016లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన భాజపా ఆ గెలుపు యాదృచ్ఛికం కాదని నిరూపించుకునేందుకు పట్టుదలతో ఉంది. కానీ జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు రాష్ట్రంలో ఆందోళనలకు దారి తీసింది. బంగ్లావలస దారులనే కాకుండా అసోం స్థానికులకు కూడా దీనితో ముప్పుందని ఆందోళన రేగటంతో ప్రభుత్వం దీన్ని ఆపేసింది. దీనికి తోడు మైక్రోఫైనాన్స్ రుణాలు గ్రామీణ అసోంలో ఆత్మహత్యలకు కారణమవుతూ సామాజిక సమస్యగా మారాయి. ఇవన్నీ భాజపా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామాలే. కానీ వాటిని వాడుకొనే పరిస్థితిలో రాష్ట్ర కాంగ్రెస్ లేకపోవటం కమలనాథులకు కలిసొచ్చే అంశం. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో పడుతూలేచే ప్రయత్నం చేస్తోంది.