మహేంద్రన్ వయస్సు 42 సంవత్సరాలు. చెనైకి చెందిన వ్యక్తి. రెండేళ్ల క్రితం మానసికంగా బాధ పడుతూ చికిత్స కోసం చెనైలోని కల్పకం మానసిక వైద్యశాలకు వెళ్లాడు. వెల్లూరుకు చెందిన దీప సైతం మానసిక సమస్యలతో అక్కడికి వెళ్లింది. ఆమెకు 36 సంవత్సరాలు. అక్కడే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒక్కటి కాబోతున్నారు.
దీపను మొదటిసారి చూసినప్పుడు తన అమ్మలా అనిపించిందని చెప్పాడు మహేంద్రన్.
"కుటుంబ సమస్యలతో, ఆస్తి వివాదాలతో సతమతమవుతూ మానసికంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. అనంతరం కల్పకం మానసిక వైద్యశాలకు చికిత్స నిమిత్తం వెళ్లాను. మొదట డాక్టర్ ఇచ్చిన సలహాలను తిరస్కరించి తిరిగొచ్చాను. మరోసారి అదే ఆసుపత్రికి వెళ్లి చికిత్సను తీసుకున్నాను. ఆ తరువాత అక్కడి కేర్ సెంటర్లో పనిచేశాను. అప్పుడే దీప సైతం చికిత్స కోసం వచ్చింది. ఆమె ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద తీసుకున్న నేను నా మనసులోని మాటను ఆమెతో చెప్పాను. ముందుగా కాస్త సమయం అడిగినప్పటికి ఆ తరువాత తానే వచ్చి పెళ్లి చేసుకుందామంది."
-మహేంద్రన్