అసోం ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని 'మిత్రజోత్' కూటమి ఘన విజయం సాధించింది. అయితే.. ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఎవర్ని వరిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎం శర్వానంద సోనోవాల్‌ను తిరిగి సీఎం అభ్యర్థిగా భాజపా అధికారికంగా ప్రకటించలేదు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ముఖ్యమంత్రిని కాదనడం ఒకింత కష్టమైన పనే!
2016లో.. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావడానికి నరేంద్ర మోదీ ప్రభ, సోనోవాల్‌కు క్లీన్ ఇమేజీ దోహదపడ్డాయి. 2016 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా సోనోవాల్‌ను భాజపా ప్రకటించింది. అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో ఎంతోకొంత వ్యతిరేకత సహజం. సోనోవాల్‌కూ ఇది వర్తిస్తుంది. ఆయన్ను మళ్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని కమలనాథులు భావించారు. కొత్తవారిని తెరపైకి తెస్తే పార్టీలో వర్గ రాజకీయాలు ప్రబలి.. ఎన్నికల్లో పార్టీ గెలుపుపై ప్రభావం పడొచ్చని అంచనావేశారు. అందువల్ల సీఎం అభ్యర్థి ఎవరనేది ముందే వెల్లడించలేదు.