తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రక్తం మరిగిన పులి'.. ఎవరీ LTTE ప్రభాకరన్‌? ఆ ఉద్యమం ఎందుకు? - ప్రభాకరన్ తమిళ్

శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ఎల్‌టీటీఈ(LTTE)ని స్థాపించిన ప్రభాకరన్‌.. దేశాధినేతలనూ హతమార్చాడు. అంతర్జాతీయ సమాజంలో రక్తం మరిగిన పులిగా మారాడు. మూడున్నర దశాబ్దాల పాటు శ్రీలంకకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆయనను అక్కడి సైన్యం 2009లో మట్టుబెట్టింది. అయితే, ఆయన బతికే ఉన్నాడంటూ ఓ తమిళ నాయకుడు తాజాగా ప్రకటించడం చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభాకరన్ నేపథ్యం గురించి పరిశీలిస్తే...

WHO IS PRABHAKARAN
WHO IS PRABHAKARAN

By

Published : Feb 14, 2023, 8:05 AM IST

వేలుపిళ్లై ప్రభాకరన్‌.. ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌గా గుర్తింపు పొందిన ఆయన పేరు నేటితరం వారికి అంతంత మాత్రంగానే తెలిసి ఉండొచ్చు. కానీ, సుమారు మూడున్నర దశాబ్దాలపాటు శ్రీలంకకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి ఆయన. ఆ దేశంలోని తమిళ ప్రజల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టినట్లు చెప్పుకొనే ప్రభాకరన్‌.. సాయుధ పోరాటం ద్వారానే తన జాతికి న్యాయం చేయొచ్చని భావించాడు. ఈ క్రమంలో ఎంతోమంది నేతలను, ప్రముఖులను దారుణంగా చంపి అంతర్జాతీయ సమాజం దృష్టిలో 'రక్తం మరిగిన పులి'గా మారాడు. అయితే, ఆయన్ను మట్టుబెట్టినట్లు 2009లోనే శ్రీలంక ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ప్రభాకరన్‌ ఇంకా బతికే ఉన్నాడంటూ తమిళ జాతీయోద్యమ నేత ఒకరు తాజాగా ప్రకటించడం చర్చనీయాంశమయ్యింది.

విద్యార్థి దశనుంచే..
శ్రీలంక జాఫ్నా ద్వీపకల్పంలోని వెల్వెట్టిథురైలో 1954 నవంబర్‌ 26న ప్రభాకరన్‌ జన్మించాడు. తండ్రి ఓ ప్రభుత్వాధికారి. నలుగురు సంతానంలో అందరికన్నా చిన్నవాడు. స్థానిక రాజకీయాలు, విద్య, ఉపాధిలో తమిళుల పట్ల శ్రీలంక ప్రభుత్వం చూపే వివక్ష పట్ల కలత చెందిన ప్రభాకరన్‌.. పాఠశాల చదువును వదిలిపెట్టి రాజకీయ సమావేశాల్లో పాల్గొనేవాడు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాడు. నెపోలియన్‌, అలెగ్జాండర్‌లంటే ఎంతో ఇష్టమని.. చేగువేరా, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌సింగ్‌లు స్ఫూర్తి అని చెప్పుకునేవాడు.

తమిళుల హక్కుల కోసం ఎల్‌టీటీఈ..
శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం తమిళ్‌ న్యూటైగర్స్‌ పేరుతో 1972లో ఓ సంస్థను ప్రారంభించాడు. ముఖ్యంగా తమిళులు అధికంగా ఉండే శ్రీలంక ఈశాన్య రాష్ట్రం నుంచి వేర్పాటువాద ఉద్యమం సాగించాడు. 1975లో జాఫ్నా మేయర్‌ ఆల్ఫ్రెడ్‌ దురైయప్పను అతి సమీపం నుంచి కాల్చి చంపాడు. ఇదే ఆయన మొట్టమొదటి రాజకీయ హత్య. 1976లో టీఎన్‌టీ పేరును లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలంగా మార్చాడు. సంస్థకు తనే నేతృత్వం వహించి.. ప్రత్యర్థుల్ని నిర్ధాక్షిణ్యంగా హత్య చేయడం మొదలుపెట్టాడు. ఆయన నాయకత్వంలో ఎల్‌టీటీఈ.. గెరిల్లా దళంగా ఎదిగింది. మూడున్నర దశాబ్దాల పాటు సాగిన ఈ ఉద్యమంలో మొత్తం 70వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఆత్మాహుతి దాడులే ఆయుధంగా..
అణచివేతకు గురైన తమిళులకు స్వేచ్ఛ పేరిట ఉత్తర శ్రీలంకలోని వన్నీ అటవీ ప్రాంతం నుంచి ఎల్‌టీటీఈ సాయుధ పోరాటం కొనసాగించింది. ప్రపంచంలో తీవ్రవాద సంస్థల్లో త్రివిధ దళాలున్నది ఒక్క ఎల్‌టీటీఈకే. టైగర్లు, సముద్ర టైగర్లు, ఎయిర్‌ టైగర్ల పేరుతో మూడు రకాల బలగాలను నడిపించేది. బ్లాక్‌ టైగర్ల పేరుతో ఆత్మాహుతి దళం కూడా ఉండేది. ఇందులో ఎక్కువగా మహిళలే ఉండేవారు. శత్రువు చేతికి చిక్కితే వెంటనే ఆత్మహత్య చేసుకోవడం కోసం ప్రభాకరన్‌ ఎల్లప్పుడూ సైనైడ్‌ గుళికను తన మెడలో వేలాడదీసుకునేవాడు. దీన్నే దళం సభ్యులు కూడా అనుసరించారు.

రాజీవ్‌ గాంధీ హత్యతోపాటు..
భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని 1991 మే 21న చెన్నైకి సమీపంలోని శ్రీ పెరంబుదూరు వద్ద ఎల్‌టీటీఈ బృందం మానవ బాంబు ప్రయోగించి హతమార్చింది. 1987లో తమపై బలవంతంగా శాంతి ఒప్పందాన్ని రుద్దారని.. తమ దళంపై దాడి చేయడానికి భారత శాంతి పరిరక్షక బలగాల్ని(ఐపీకేఎఫ్‌) రాజీవ్‌ గాంధీ వినియోగించాడన్న కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. 1991లో శ్రీలంక మంత్రి రంజన్‌ విజేరత్నే, 1993లో శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాస, 2005లో శ్రీలంక విదేశాంగ మంత్రి లక్ష్మణ్‌ కదిర్‌గమర్‌తో సహా ఎంతో మంది ప్రత్యర్థులు, ఉదారవాద తమిళనేతలు ఎల్‌టీటీఈ చేతిలో హత్యకు గురయ్యారు. ఇలా 'రక్తం మరిగిన పులి'గా మారిన ప్రభాకరన్‌ను 1991లో ఇంటర్‌పోల్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. అదే ఏడాది రాజీవ్‌ గాంధీ హత్యకుగానూ మద్రాసు హైకోర్టు మరణదండన విధించింది. 1996లో కొలంబోలో ఓ సెంట్రల్‌ బ్యాంకు పేల్చివేతకుగాను అక్కడి కోర్టులో 200 ఏళ్ల శిక్ష పడింది.

అందుకే సాయుధ పోరాటం..
శ్రీలంకలోని తమిళ ప్రజల దీనస్థితి తనను ఆయుధం పట్టేలా చేసిందని చెప్పేవాడు ప్రభాకరన్‌. ఓ పథకం ప్రకారమే తమపై నరమేధం సాగుతోందని అనేవాడు. తమ జాతిని సమూలంగా నాశనం చేసేందుకు జరుగుతున్న ఈ నిరంకుశ రాజ్యం నుంచి ప్రజలను రక్షించేందుకే సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నట్లు మరణించడానికి ముందు ఓ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే, ప్రత్యేక తమిళ ఈలం కోసం 35ఏళ్ల పాటు రక్తపుటేర్లు పారించిన ప్రభాకరన్‌.. చివరకు 2009లో శ్రీలంక సైన్యం జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. దీంతో ప్రపంచంలోనే సుదీర్ఘకాలం పాటు సాగిన వేర్పాటువాద ఉద్యమం అంతమైనట్లయ్యింది.

బతికే ఉన్నారా?
అయితే, ఆయన ఇంకా జీవించే ఉన్నారంటూ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పళ నెడుమారన్‌ సంచలన ప్రకటన చేశారు. శ్రీలంక తమిళులకు విముక్తి కల్పించేందుకు ఆయన త్వరలోనే బయటకొస్తారని అన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారనేది మాత్రం తాను చెప్పనని, ప్రభాకరన్‌ కుటుంబంతో తాను ఇప్పటికీ మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రభాకరన్ బతికున్నారన్న విషయాన్ని ఆయన అనుమతితోనే బహిరంగంగా చెబుతున్నట్లు పేర్కొన్నారు. అయితే నెడుమారన్ వ్యాఖ్యలను శ్రీలంక సైన్యం ఖండించింది. ప్రభాకరన్ జీవించి ఉన్నారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రభాకరన్ మరణించినట్టు ధ్రువీకరించే డీఎన్ఏ సర్టిఫికెట్స్‌తో సహా అన్ని ఆధారాలు శ్రీలంక వద్ద ఉన్నాయని శ్రీలంక డైరెక్టర్ మీడియా అండ్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరత్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details