EKNATH SHINDE MAHARASHTRA:ఒకప్పుడు రిక్షా తొక్కితేనే పొట్టగడిచే పరిస్థితి ఆయనది.. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు రాష్ట్ర అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారాయన.. ఠాక్రేను దించేయాలన్నా.. భాజపాను గద్దెనెక్కించాలన్నా ఆయన చేతిలో పనే! ఆయన నిర్ణయంపైనే మహా వికాస్ అఘాడీ సర్కారు భవితవ్యం ఆధారపడి ఉంది. బాలాసాహెబ్ స్ఫూర్తితో రాజకీయాల్లో శక్తిమంతమైన నేతగా మారి.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో గుజరాత్లో మకాం పెట్టి.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరలేపిన ఆయనే.. ఏక్నాథ్ శిందే.
Maharashtra political crisis 2022:శివసేనలో ఏక్నాథ్ శిందే స్థానం చాలా ముఖ్యమైనదే. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. అందువల్లే ఆయన ఫిరాయింపు.. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే, పార్టీ ఠాణె జిల్లా ఇంఛార్జ్ ఆనంద్ దిఘే ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు ఏక్నాథ్. 1980లలో శివసేనలో చేరారు. అప్పట్లో రిక్షా తొక్కుతూ జీవనం సాగించేవారు శిందే. అంచెలంచెలుగా ఎదిగి 1984లో పార్టీ కిసాన్‌నగర్ బ్రాంచ్ హెడ్‌గా నియమితులయ్యారు. 1997లో ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఠాణె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో ఠాణె జిల్లాకు శివసేన అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో కొపారి- పంచపఖాడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో కేబినెట్ మంత్రి అయ్యారు. 2019లో వైద్య శాఖ బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం ఆయన శివసేనపై తిరుగుబాటు చేసి గుజరాత్, సూరత్‌లోని ఓ హోటల్లో ఉన్నారు. ముప్పై మంది వరకు ఎమ్మెల్యేలు ఆయనతో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సంఖ్యపై స్పష్టత లేదు. అయితే, ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చే సత్తా ఆయనకు ఉంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామా చేసినా.. లేదా తమ శాసనపక్షాన్ని భాజపాలో విలీనం చేసినా.. మహావికాస్ అఘాడీ సర్కారు పడిపోయే ఛాన్సుంది. అయితే, ఏక్నాథ్ శిందే తిరుగుబాటుకు కారణం ఏంటి? శివసేనలో ఇన్నేళ్లు బలమైన నేతగా ఉన్న ఆయన.. ఎందుకు జెండా ఎత్తేశారు? ఇందుకు నాలుగు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
మొదటిది.. ఉద్ధవ్ ఠాక్రే
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్నాథ్ శిందే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ బాధ్యతలన్నీ ఠాక్రే ఒక్కరే చూసుకుంటున్నారని, ఇది శిందేకు నచ్చలేదని తెలుస్తోంది. మహా వికాస్ అఘాడీ ఏర్పడిన సమయంలో శిందే కీలకంగా వ్యవహరించారు. అప్పుడే శివసేన సభాపక్ష నేతగా ఎంపికయ్యారు. అయితే, ముఖ్యమంత్రి పదవిని తనకు ఇస్తారని శిందే ఆశించినట్లు సమాచారం. అనూహ్యంగా.. ఠాక్రే కుటంబంలో ఎన్నడూ లేని రీతిలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఉద్ధవ్. ఈ నేపథ్యంలో బుజ్జగింపుల్లో భాగంగానే పట్టణాభివృద్ధి, ప్రజా పనుల శాఖలను ఠాక్రే.. ఏక్నాథ్ శిందేకు అప్పగించారని విశ్లేషకులు చెబుతున్నారు.
సంజర్ రౌత్‌కు ప్రాధాన్యం..
మహారాష్ట్రలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ముందుండి నడిపించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో చర్చలు జరపడంలో రౌత్.. కీలకంగా వ్యవహరించారు. పార్టీ తరఫున ప్రతి విషయంపైనా ఆయనే స్పందించేవారు. ఇప్పటికీ శివసేనలో ప్రధాన హోదాలో ఉన్నారు. ఇది కూడా ఏక్నాథ్ శిందేకు నచ్చట్లేదని తెలుస్తోంది. వ్యూహాత్మక సమావేశాలకు, చర్చలకు తనను దూరం పెడుతున్నారన్న భావన ఆయనలో ఏర్పడింది. ఇది అసంతృప్తిని పెంచింది.
ఆదిత్య ఠాక్రే బ్రాండింగ్
ముఖ్యమంత్రి పదవిని ఉద్ధవ్ ఠాక్రే చేపట్టిన తర్వాత.. ఆయన తన తనయుడిని కేబినెట్లోకి తీసుకోవడం, తర్వాతి సీఎం ఆయనే అంటూ పరోక్షంగా ప్రచారాలు చేయించడంపై ఏక్నాథ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ అనారోగ్యంతో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి పదవి కోసం జరిగిన చర్చల్లో ఠాక్రే భార్య రష్మి, కుమారుడు ఆదిత్య పేర్లు వినిపించాయి. తన పేరును అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదన్న భావన ఆయనలో పెరిగింది. ఉద్ధవ్ తర్వాత అయినా తనకు సీఎం పదవి దక్కుతుందనే ఆశతో ఉన్న ఏక్నాథ్ శిందేకు ఇది ఏమాత్రం రుచించలేదు.