WHO IS EKNATH SHINDE: ఒకప్పుడు రిక్షా తొక్కితేనే పొట్టగడిచే పరిస్థితి ఆయనది.. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు రాష్ట్ర అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారాయన.. ఠాక్రేను దించేసి.. భాజపాను గద్దెనెక్కించారు... ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పదవినే సంపాదించారు. బాలాసాహెబ్ స్ఫూర్తితో రాజకీయాల్లో శక్తిమంతమైన నేతగా మారి.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో గుజరాత్లో మకాం పెట్టి.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరలేపిన ఆయనే.. ఏక్నాథ్ శిందే.
Maharashtra political crisis 2022: శివసేనలో ఏక్నాథ్ శిందే స్థానం చాలా ముఖ్యమైనదే. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. అందువల్లే ఆయన ఫిరాయింపు.. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే, పార్టీ ఠాణె జిల్లా ఇంఛార్జ్ ఆనంద్ దిఘే ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు ఏక్నాథ్. 1980లలో శివసేనలో చేరారు. అప్పట్లో రిక్షా తొక్కుతూ జీవనం సాగించేవారు శిందే. అంచెలంచెలుగా ఎదిగి 1984లో పార్టీ కిసాన్‌నగర్ బ్రాంచ్ హెడ్‌గా నియమితులయ్యారు. 1997లో ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఠాణె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో ఠాణె జిల్లాకు శివసేన అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో కొపారి- పంచపఖాడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో కేబినెట్ మంత్రి అయ్యారు. 2019లో వైద్య శాఖ బాధ్యతలు చేపట్టారు.
శివసేనపై తిరుగుబాటు చేసి గుజరాత్, సూరత్‌లోని ఓ హోటల్లో.. ఆ తర్వాత అసోం గువాహటిలోని హోటల్లో మకాం పెట్టారు. శివసేన, స్వతంత్రులు కలిసి 50 మందికి పైగా ఎమ్మెల్యేలతో విజయవంతంగా తిరుగుబాటును నడిపించారు. అయితే, ఏక్నాథ్ శిందే తిరుగుబాటుకు కారణం ఏంటి? శివసేనలో ఇన్నేళ్లు బలమైన నేతగా ఉన్న ఆయన.. ఎందుకు జెండా ఎత్తేశారు? ఇందుకు నాలుగు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
మొదటిది.. ఉద్ధవ్ ఠాక్రే
ఇప్పటివరకు సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్నాథ్ శిందే అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ బాధ్యతలన్నీ ఠాక్రే ఒక్కరే చూసుకున్నారని, ఇది శిందేకు నచ్చలేదని తెలుస్తోంది. మహా వికాస్ అఘాడీ ఏర్పడిన సమయంలో శిందే కీలకంగా వ్యవహరించారు. అప్పుడే శివసేన సభాపక్ష నేతగా ఎంపికయ్యారు. అయితే, ముఖ్యమంత్రి పదవిని తనకు ఇస్తారని శిందే ఆశించినట్లు సమాచారం. అనూహ్యంగా.. ఠాక్రే కుటంబంలో ఎన్నడూ లేని రీతిలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఉద్ధవ్. ఈ నేపథ్యంలో బుజ్జగింపుల్లో భాగంగానే పట్టణాభివృద్ధి, ప్రజా పనుల శాఖలను ఠాక్రే.. ఏక్నాథ్ శిందేకు అప్పగించారని విశ్లేషకులు చెబుతున్నారు.