Aparna Yadav: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి షాక్ తగిలింది. సమాజ్‌వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్.. భాజపాలో చేరారు. గతకొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి.. ప్రత్యర్థి పార్టీ భాజపాలో చేరడం ఎన్నికల సమయంలో పెద్ద మార్పే అని చెప్పాలి. ఇంతకీ అపర్ణా యాదవ్ ఎవరు?
ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్ యాదవ్‌ను అపర్ణ 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. మాజీ జర్నలిస్టు కుమార్తె అయిన అపర్ణ.. లఖ్‌నవూలో డిగ్రీ పూర్తి చేశారు. రాజకీయాలపై ఆసక్తితో యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పాలిటిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అపర్ణ క్లాసికల్ సింగర్. జంతు ప్రేమికురాలు కూడా. 'బి అవేర్' అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. జంతు సంరక్షణతో పాటు మహిళల భద్రతపైనా పనిచేస్తున్నారు.
ఐదేళ్ల కిందటే రాజకీయ అరంగేట్రం..
అపర్ణ భర్త ప్రతీక్ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించరు. సమాజ్‌వాదీ పార్టీ కార్యకలాపాలకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉంటారు. కానీ అపర్ణ రాజకీయాలంటే ఆసక్తితో 2017లోనే అరంగేట్రం చేశారు. ఆ ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున లఖ్‌నవూ కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ములాయం కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 22వ వ్యక్తి ఈమె. అయితే ఆ ఎన్నికల్లో భాజపా నాయకురాలు రీటా బహుగుణ జోషి చేతిలో 34వేల పైచిలుకు తేడాతో ఓటమి చవిచూశారు. తొలి ఎన్నికల్లోనే ఓటమిపాలైనా.. నిరాశ చెందకుండా రాజకీయ కార్యక్రమాల్లో క్రియాశీలకంగానే ఉంటున్నారు.
మోదీ, యోగిపై ప్రశంసలు..
అయితే, గత కొంతకాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై వివిధ సందర్భాల్లో అపర్ణ ప్రశంసలు కురిపించారు. ఎన్ఆర్సీ, ఆర్టికల్ 370 రద్దును సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకిస్తే.. అపర్ణ సమర్థించడం గమనార్హం. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆమె రూ.11లక్షల విరాళంగా ఇచ్చారు. యోగి ప్రభుత్వం ఆమెకు వై కేటగిరి భద్రత కూడా కల్పించింది. ఈ క్రమంలోనే ఆమె భాజపాలో చేరనున్నట్లు ఆ మధ్య ప్రచారం జోరందుకుంది. అయితే ఈ వార్తలను అఖిలేశ్ గతంలో ఖండించారు. ఇది తమ కుటుంబ వ్యవహారమని చెప్పుకొచ్చారు. కానీ, ఆ ఊహాగానాలను నిజం చేస్తూ అపర్ణ బుధవారం భాజపాలో చేరారు.