తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాయావతి 'నామమాత్రపు' పోటీ- మరి దళితుల మద్దతు ఎవరికి? - యూపీలో మాయావతి నామమాత్రపు పోటీ

UP election Dalit votes: ఉత్తర్‌ప్రదేశ్​ రాజకీయాల్లో 'కులం' కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు దళిత కార్డుతో బలమైన రాజకీయ శక్తిగా కొనసాగిన బహుజన సమాజ్ పార్టీ( బీఎస్పీ) నామమాత్రపు పోటీదారుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గం ఎవరివైపు? రెండోసారి అధికారం కైవసం చేసుకోవాలని కమలం పార్టీ, పునర్వైభవం సాధించాలని అఖిలేష్‌ యాదవ్‌ గెలుపు వ్యూహాలకు పదునుపెడుతున్న వేళ.. దళిత ఓటర్ల మద్దతు ఎవరికి? బీఎస్పీ తీరుతో యూపీలో మారిన సామాజిక సమీకరణాలపై కథనం.

UP election 2022
దళితులు మద్దతు ఎవరికో?

By

Published : Jan 19, 2022, 5:32 PM IST

UP election Dalit votes: ఉత్తర్‌ప్రదేశ్​లో రాజకీయ చైతన్యాన్ని రగిలించిన బహుజన సమాజ్ పార్టీ( బీఎస్పీ).. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రపు పోటీదారుగా కనిపిస్తోంది. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఈసారి అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీల మధ్యే పోటీ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంతవరకు బలమైన రాజకీయశక్తిగా కొనసాగిన మాయావతి సారథ్యంలోని బీఎస్పీకి దన్నుగా నిలిచిన దళితులు ఈసారి ఏ రాజకీయ పక్షానికి మద్దతిస్తారన్నది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భాజపాకు దళితులే కీలకం..

భాజపా నుంచి ఇటీవల కొంతమంది ప్రముఖ ఓబీసీ నేతలు ఎస్పీ గూటికి చేరటం ద్వారా దళితులు మరింత కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో ఆ వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు భాజపా తనదైన వ్యూహాలను అమలుచేస్తోంది. హిందుత్వ కార్డుతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారికి చేరువయ్యేందుకు పావులు కదుపుతోంది.

యూపీలో దళిత జనాభా 21శాతం ఉండగా.. అందులో మాయావతి సామాజికవర్గం, దళిత ఉపకులమైన జాతవ్‌లు 55శాతంగా ఉన్నారు. మాయావతి ఎక్కువగా తన సామాజిక వర్గంపైనే ఆధారపడుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అప్పటి వరకు కాంగ్రెస్​కు మద్దతుగా..

1990లో కాన్షీరామ్ సారథ్యంలోని బీఎస్పీ రాజకీయ శక్తిగా అవతరించే వరకు యూపీ దళితులు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు. బ్రాహ్మణులు, దళితులను ఏకం చేసే సోషల్‌ ఇంజినీరింగ్‌ ఫార్ములాతో 2007 ఎన్నికల్లో మాయావతి పూర్తి మెజార్టీతో అధికారం చేపట్టారు. ఆ తర్వాత ఎన్నికల్లో బెహన్‌జీ చేసిన ఇలాంటి ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

యూపీ దళితులపై మాయావతి ఆధిపత్యాన్ని తగ్గించేందుకు భాజపా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి ఆ వర్గం వారికి చేరవయ్యేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. సబ్‌ కా సాత్‌- సబ్‌ కా వికాస్‌ అనే పార్టీ నినాదం వెనుక అంతరార్థం ఇదేనని కమలనాథులు చెబుతున్నారు. కొన్ని తరాలుగా అగ్రవర్ణాలు, దళితుల మధ్య ఉన్న విభజనరేఖను తుడిచే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

కరోనా కష్టకాలంలో రెండింతల రేషన్‌, జన్‌ ఔషధీ వంటి పథకాలు సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు ఎంతో మేలు చేసినట్లు కాషాయదళం చెబుతోంది.

  • ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించటానికి ముందే దళితులకు చేరువయ్యేందుకు యూపీలోని 75 జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది.
  • జనరల్‌ స్థానాల్లో దళితులకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.
  • ఇప్పటికే రెండోవిడత పోలింగ్ జరిగే షహరన్‌పూర్ లో జగ్‌పాల్ సింగ్ ను బరిలో దించింది.
  • 107 మంది అభ్యర్థులతో భాజపా ప్రకటించిన తొలి జాబితాలో 19మంది దళితులు ఉన్నారు.
  • అందులో మాయావతి సామాజికవర్గం జాతవ్ వర్గానికి చెందిన 13 మందికి టికెట్లు ఇచ్చారు.

ఓబీసీల ఏకీకరణకే ఎస్పీ మొగ్గు..

దళిత ఓటు బ్యాంక్‌పై కాషాయదళం గురిపెట్టినప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ మాత్రం ఓబీసీల ఏకీకరణకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. యాదవులు-ముస్లింల పార్టీగా గుర్తింపు పొందిన ఎస్పీని.... అఖిలేష్ మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. వెనకబడిన కులాల నేతలను చేర్చుకోవటం ద్వారా దళితులను పార్టీకి చేరువ చేస్తుందని ఎస్పీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిన్నాచితక పార్టీలతో జట్టు కట్టిన అఖిలేష్‌.. దళిత నేత, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ చంద్రశేఖర్‌ చేసిన పొత్తు ప్రతిపాదనపై కనీసం స్పందించలేదు. ఆయన ఎస్పీపై ఆగ్రహంతో ఉన్నారు. ఓబీసీ నేతల చేరికలను ప్రోత్సహించటంతోపాటు ఆజాద్‌ సమాజ్‌ పార్టీతో పొత్తుకు విముఖత చూపటం ద్వారా యూపీలో సరికొత్త సామాజిక సమీకరణాలకు అఖిలేష్‌ తెరలేపినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details