తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రగతి ప్రస్థానంలో మనం ఎక్కడున్నాం?

భారత్​కు స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు గడిచాయి. 75వ వసంతంలో ​అడుగు పెట్టింది. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే ప్రగతి పస్థానం మనం ఎక్కడున్నాం అనేది సూటిప్రశ్న. బానిస సంకెళ్లు తెగిపడిన దరిమిలా- ఆకలిని, అనారోగ్యాన్ని, దరిద్రాన్ని అంతమొందించి సామాజిక అంతరాలను పరిమారుస్తామని రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా బాబూ రాజేంద్రప్రసాద్‌ జాతికిచ్చిన భరోసా చెవుల్లో మార్మోగుతుంది. ప్రజానీకానికి గౌరవప్రదమైన జీవన స్థితిగతులు కల్పిస్తామన్న హామీ సైతం స్మృతిపథంలో ప్రతిధ్వనిస్తుంది. ఇన్ని దశాబ్దాల్లో వాటికి ఏ గతి పట్టింది?

after 74 years Independence
ప్రగతి ప్రస్థానంలో మనం ఎక్కడ?

By

Published : Aug 15, 2021, 4:46 AM IST

దాదాపు రెండు వందల సంవత్సరాలపాటు శ్వేత జాతీయుల పాలనలో, పరతంత్ర చెరలో మగ్గిన భరతజాతి ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల అపార త్యాగాల ఫలితంగా బంధవిముక్తమై స్వేచ్ఛావాయువులు పీల్చింది 74 ఏళ్లక్రితం ఇదే రోజున. 'ప్రాగ్దిశాకాశంలో ఉదయించిన వినూత్న తార'గా నాడు పండిత నెహ్రూ అభివర్ణించిన స్వతంత్ర భారతి నేటినుంచి సంవత్సర కాలంపాటు అమృతోత్సవాల నిర్వహణకు సన్నద్ధమైన వేళ- ఇన్నేళ్ల ప్రస్థానం ఎలా మొదలై ఎక్కడికి చేరిందన్నది సూటిప్రశ్న. ఆగస్ట్‌ 15 అనగానే స్వతంత్ర సమర సేనానుల సుదీర్ఘ పోరాటం కళ్లముందు కదలాడి ఒడలు జలదరిస్తుంది. ‘క్విట్‌ ఇండియా!’ రణఘోష దిక్కులు పిక్కటిల్లేలా చేసి తెల్లవారి గుండెల్లో మరఫిరంగులు పేల్చి తట్టాబుట్టా సర్దుకునేలా ప్రేరేపించిన ఉద్విగ్న ఘట్టాలు స్ఫురించి మేను రోమాంచితమవుతుంది. బానిస సంకెళ్లు తెగిపడిన దరిమిలా- ఆకలిని అనారోగ్యాన్ని దరిద్రాన్ని అంతమొందించి సామాజిక అంతరాలను పరిమారుస్తామని రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా బాబూ రాజేంద్రప్రసాద్‌ జాతికిచ్చిన భరోసా చెవుల్లో మార్మోగుతుంది. ప్రజానీకానికి గౌరవప్రదమైన జీవన స్థితిగతులు కల్పిస్తామన్న హామీ సైతం స్మృతిపథంలో ప్రతిధ్వనిస్తుంది. ఇన్ని దశాబ్దాల్లో వాటికి ఏ గతి పట్టింది?

తక్కిన దేశాలతో పోలిస్తే..

ఆగస్ట్‌ 15 ఒక్క భారతీయులకే ప్రత్యేకం కాదు. సాంకేతికంగా మనకన్నా ఒక రోజు ముందు ఆగస్ట్‌ 14న పాకిస్థాన్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. 1866లో లిఫ్‌స్టెన్‌షైన్‌, 1945లో కొరియా, 1960లో కాంగో, 1971లో బహ్రెయిన్‌... ఆగస్ట్‌ పదిహేనో తేదీనే స్వపరిపాలనకు ఉద్యుక్తమయ్యాయి. తలసరి ఆదాయం ప్రాతిపదికన ఐరోపాలో అత్యంత సంపన్న దేశంగా లగ్జెంబర్గ్‌ పేరొందగా- ప్రపంచంలోనే కుబేర దేశమన్న హోదా లిఫ్‌స్టెన్‌షైన్‌కు దఖలుపడింది. 1948లో ఉత్తర దక్షిణ కొరియాలుగా విడిపోయాక సియోల్‌ రాజధానిగా అధికారిక కొరియా గణతంత్రం వాహన తయారీ రంగాన దిగ్గజ శక్తిగా ఎదిగింది. దక్షిణాఫ్రికాలో దక్షిణాది దేశమైన కాంగో ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ మునుపటి పేరు జైరే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజ వనరులకు నెలవైన ప్రాంతమది. పశ్చిమాసియాలోని పర్షియన్‌ గల్ఫ్‌ పడమర తీరంలో చిన్న ద్వీపకల్ప దేశమైన బహ్రెయిన్‌ పర్యాటక స్థలిగా రాణిస్తోంది. వాటితో భారత్‌ను ఎందులో పోల్చగలం? ఆసియా, ఆఫ్రికా ఖండాలకు సంబంధించి 1945-1960 సంవత్సరాల మధ్య కాలంలో ఐరోపా వలస పాలకుల బారినుంచి సుమారు మూడు డజన్ల దేశాలు స్వాతంత్య్రం పొందాయి. వాటిలో ఇండియా ఒకటి.

ఇంచుమించు ఏకకాలంలో స్వతంత్ర ప్రస్థానం ప్రారంభించిన దేశాల జాబితాలో వెంటనే స్ఫురించేవి- ఇండొనేసియా, అల్బేనియా, పోలండ్‌ (1945), ఫిలిప్పీన్స్‌ (1946), శ్రీలంక, ఇజ్రాయెల్‌ (1948), పశ్చిమ-తూర్పు జర్మనీలు, చైనా (1949). వియత్నాం, జోర్డాన్‌, చెకొస్లొవేకియా వంటివీ ఆ కోవకే చెందుతాయి. 1960నాటికి భారత్‌, చైనాలలో సగటు తలసరి ఆదాయం రమారమి ఒకేలాగా ఉండేది. ఇక్కడికన్నా పదమూడేళ్లముందు 1978లో ఆర్థిక సంస్కరణలకు తెరచాపలెత్తింది మొదలు ఇటీవలివరకు 10శాతందాకా వార్షికాభివృద్ధితో పురోగమించిన జనచైనా 80కోట్లమందికిపైగా పౌరుల్ని దారిద్య్రం కోరలనుంచి వెలికిలాగింది. ఆరోగ్యం, విద్య, పారిశ్రామికం నుంచి క్రీడల దాకా భిన్నరంగాల్లో ‘సూపర్‌పవర్‌’గా రాణిస్తోంది. మౌలిక వసతుల ప్రాతిపదికన ఇండియా కన్నా మెరుగ్గా ఉన్న ఇండొనేసియాలో తలసరి రాబడి, ప్రజల కొనుగోలుశక్తి ఇక్కడితో పోలిస్తే రెండింతల పైమాటే. భారత్‌లో 77.7 శాతంగా ఉన్న అక్షరాస్యత ఫిలిప్పీన్స్‌లో 93.4శాతంగా నమోదవుతోంది.

సుశిక్షిత మానవ వనరుల పరంగా ఫిలిప్పీన్స్‌ సహజ బలిమి విదేశీ పెట్టుబడుల్ని సూదంటు రాయిలా ఆకట్టుకుంటోంది. విస్తార భౌగోళిక పరిమాణం కలిగిన భారతావనికి దిగువన కన్నీటిబొట్టు ఆకారంలో ఉండే శ్రీలంక అక్షరాస్యత, పౌరుల తలసరి ఆదాయం, అక్షరాస్యత శాతం, ఆయుర్దాయాలతోపాటు పేదరిక నిర్మూలనలోనూ ఆధిక్యం చాటుకుంటోంది. ఇండియా ఇప్పటికీ వర్ధమాన దేశాల వరసలో సాగుతుండగా- ఇజ్రాయెల్‌ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేరింది. సృజనాత్మక సేద్యం, రక్షణ, సైబర్‌ భద్రత తదితర రంగాల్లో విశేష అభివృద్ధికి అది చెరగని చిరునామాగా మారింది. భౌగోళిక పరిమాణం రీత్యా ఇండియాలో తొమ్మిదో వంతే ఉండే జర్మనీ కీలక ప్రగతి సూచీల్లో యోజనాల దూరం ముందుంది. పలు వాణిజ్య సూచీల్లో భారత్‌ను తలదన్నుతున్న వియత్నాం భారీ తయారీ రంగ కేంద్రంగా వేళ్లూనుకుంటోంది. ఇండియాకన్నా చైనా, బంగ్లాదేశ్‌, వియత్నామ్‌ల నుంచే అమెరికాకు అధికంగా దుస్తుల ఎగుమతులు జోరెత్తుతున్నాయి. సూక్ష్మరుణ పంపిణీకి మారుపేరుగా ఖ్యాతి గడించిన బంగ్లాదేశ్‌- భారీయెత్తున జౌళి ఉత్పాదనల ఎగుమతులతో నవశక్తిగా దక్షిణాసియా ఉజ్జ్వల తారగా మెరుపులీనుతోంది.

భారత్​ గణాంకాలు

ఆత్మశోధనకిది తరుణం..

జనసంఖ్య, భూవైశాల్యం, ప్రకృతి సంపద- ఏ రకంగానూ భారత్‌కు సాటి, పోటీ కాలేని ఎన్నో దేశాలు తమదైన ప్రత్యేకత నిరూపించుకుంటుంటే... అవినీతి ప్రజ్వలనం, సామాజిక అసమానతలు, పోషకాహార లోపాలు, లింగపరమైన కులమతపరమైన దుర్విచక్షణలు, మౌలిక లోటుపాట్లు, జాతి జీవనాడి లాంటి సేద్యరంగాన నిరాశా నిస్పృహలతో స్వతంత్ర భారతం కళావిహీనమవుతోంది. ఒకప్పుడు అర్భక దేశాలుగా నవ్వులపాలైన మలేసియా, థాయ్‌లాండ్‌ వంటివీ ప్రణాళికాబద్ధంగా పురోగమిస్తున్నాయి. మనకన్నా ఎంతో చిన్నదేశాలు ఏళ్లతరబడి ఇక్కడికి పప్పుధాన్యాలను, నూనెగింజల్ని ఎగుమతి చేస్తున్నాయి. ప్రపంచంలో అమెరికా తరవాత అత్యధికంగా సేద్యయోగ్య భూములున్న ఇండియాకా ఈ దుర్గతి? విశ్వంలో మరెక్కడా లేనంతటి స్థాయిలో యువశక్తి పోగుపడిన దేశంలోనా నిపుణ శ్రామికులకు నిత్యక్షామం? భూగోళంమీద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నేరగ్రస్త రాజకీయాలతో, ప్రగతి సూచీల్లో మందభాగ్యంతో కునారిల్లుతోంది. ఆకలి, అభద్రత, అపరిశుభ్రత, నిరుద్యోగం, నిరక్షరాస్యత, నిర్లిప్తత, నిష్పూచీతనాలను పారదోలితేనే- పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రం సార్థకమవుతుంది. అందుకోసం ప్రజాప్రభుత్వాలు నిబద్ధ కృషి సాగించడమే- అలనాటి నేతాగణం అసమాన త్యాగాలకు, బలిదానాలకు సరైన నివాళిగా మన్ననలందుకుంటుంది!

ఇతరే దేశాలతో పోలిస్తే..

బంగ్లాదేశ్‌

50 సంవత్సరాల క్రితం తూర్పు పాకిస్థాన్‌ ప్రాంతం బంగ్లాదేశ్‌గా అవతరించేనాటికి అది దక్షిణాసియాలోని అతి పేద దేశాల్లో ఒకటిగా ఉండేది. అప్పటికది భారత్‌ కన్నా, పాకిస్థాన్‌ కన్నా అన్నింటా తీసికట్టు అనిపించుకునేది. 1974లో నిక్సన్‌ ప్రభుత్వం అకస్మాత్తుగా ఆహార సహాయం నిలిపి వేసేసరికి కరవు కోరల్లో నలుగుతున్న బంగ్లాదేశ్‌ విలవిల్లాడిపోయింది. క్యూబాకు గోనెసంచులు ఎగుమతి చేసి బొటాబొటీ రాబడితో నెట్టుకొచ్చేది. అటువంటిదిప్పుడు ఆర్థిక సుస్థిరాభివృద్ధికి స్ఫూర్తిమంతమైన ఉదాహరణగా నిలుస్తోంది.

రచయిత - వై.ఆర్‌.బి.సత్యమూర్తి

ఇదీ చూడండి:1947 నుంచి త్రివర్ణ పతాకాన్ని కాపాడుతున్న కుటుంబం

ABOUT THE AUTHOR

...view details