లండన్‌లో లా చదివిన గాంధీ ఉద్యోగం కోసం 1893లో దక్షిణాఫ్రికా చేరుకున్నారు. అనేక అవమానాలు, వివక్షలు ఎదుర్కొంటూనే... క్రమంగా నాయకుడిగా ఎదుగుతున్న దశ అది! దక్షిణాఫ్రికాలోని భారతీయులు, కార్మికుల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు తెలపటం ఆరంభించారు. ఆ సమయంలో వచ్చింది రెండో బోర్ యుద్ధం!
ఏమిటీ బోర్ యుద్ధం?
దక్షిణాఫ్రికాలోని డచ్ మాట్లాడే స్థానిక ప్రజల రాష్ట్రాలు బోర్ రిపబ్లిక్స్. ఆరెంజ్ ఫ్రీ స్టేట్ కూడా అలాంటిదే. అప్పటికే దక్షిణాఫ్రికాపై పట్టు సంపాదించిన బ్రిటన్ వీటిని కూడా స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో జరిగిందే బోర్ యుద్ధం (1899-1902)! ఈ యుద్ధంలో బోర్ రిపబ్లిక్స్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్ ఓడిపోయాయి. ఈ రాష్ట్రాల్లో భారీ ఎత్తున బంగారు, వజ్రాల వనరులుండటంతో వీటిపై పట్టుకోసం పోరాటం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటన్ తరఫున పోరాడిన సైనికుల్లో అనేకమంది భారతీయ సిపాయిలే! ‘బ్రిటిష్ పౌరులకున్న హక్కులనే తమకూ ఇవ్వమని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. వాటిని ఇవ్వాల్సిన ప్రభుత్వం యుద్ధంలో పోరాడుతున్నప్పుడు వారికి మద్దతుగా నిలవటం భారతీయుల బాధ్యత’ అని భావించిన గాంధీజీ- యుద్ధంలో గాయపడ్డ సైనికులను స్ట్రెచర్లపై శిబిరాలకు, ఆస్పత్రులకు చేర్చి, చికిత్స చేయించేందుకు ఇండియన్ అంబులెన్స్ కోర్‌ను ఏర్పాటు చేశారు. బ్రిటన్ సైన్యంలో సార్జెంట్ మేజర్‌గా ఐదునెలల పాటు సేవలందించారు. వైద్య సేవలందించేందుకు వీలుగా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ సేవలకు మెచ్చిన బ్రిటన్ ప్రభుత్వం 1915లో గాంధీ భారత్‌కు తిరిగి వచ్చాక కైసర్ -ఇ- హింద్ మెడల్‌తో ఆయన్ను సత్కరించింది. (జలియన్‌వాలాబాగ్ దుర్ఘటన తర్వాత దాన్ని గాంధీజీ తిరిగి ఇచ్చేశారు.)