Wheelchair marathon: వెన్నెముక దెబ్బతిని నడవలేని పరిస్థితి. వీల్ ఛైర్‌కే పరిమితం. అలాంటి వ్యక్తి ఇప్పుడు గిన్నిస్ రికార్డుపై కన్నేశారు. అదేలా అంటారా.. వీల్‌ఛైర్‌లో 24 గంటల్లోనే 200 కిలోమీటర్లు చుట్టేసి రికార్డుల్లోకి ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనే.. ఒడిశాకు చెందిన పారాఅథ్లెట్ కమలాకాంత్ నాయక్.
భువనేశ్వర్‌లోని మాస్టర్ క్యాంటీన్ స్క్వేర్ నుంచి రాజ్‌మహల్ స్క్వేర్ సైకిల్ ట్రాక్ పాయింట్ వరకు 200 కిలోమీటర్లు ఉంటుంది. వీల్‌ఛైర్‌పై ఈ ట్రాక్‌పై ఆదివారం మారథాన్ ప్రారంభించారు కమలాకాంత్ నాయక్. ఆయనకు ఒడిశా వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్‌తో పాటు బెట్టర్లైఫ్ ఫౌండేషన్ బృందం మద్దతుగా నిలిచారు.
ఈ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకుని గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కటమే లక్ష్యంగా మారథాన్ చేపట్టినట్లు తెలిపారు కమలాకాంత్ నాయక్.
" వెన్నముక దెబ్బతిన్న తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో కుంగిపోయాను. కానీ, నా కుటుంబం, కోచ్, డాక్టర్లు నాకు మద్దతుగా నిలిచారు. నేను త్వరగా కోలుకునేలా చేశారు. నా సోదరి, ఒలాత్పుర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహబిలిటేషన్, ట్రైనింగ్, రీసర్చ్ కేంద్రం డాక్టర్ పీపీ మొహంతి, దుర్గాబాయి, ఎస్.వైద్యనాథన్, కోచ్.. నాలో ధైర్యం నింపారు. పారా అథ్లెట్లో పాల్గొనేందుకు దోహదపడ్డారు. మంచం పైనుంచి లేచే పరిస్థితి లేనప్పుడు నాకు అండగా నిలిచారు. వారి వల్లే ఈరోజు మారథాన్ చేపడుతున్నా. 200 కిలోమీటర్ల మారథాన్ చేపట్టేందుకు ఇదే సరైన సమయం. ఇతర మనుషులతో మనం వేరుకాదు, అందరిలాగే అన్ని పనులు చేయొచ్చనేది దివ్యాంగులకు నేను ఇచ్చే సందేశం."