కొత్త ప్రైవసీ పాలసీ విషయంలో మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎట్టకేలకు దిగొచ్చింది. సమాచార భద్రతా బిల్లు అమలులోకి వచ్చే వరకు నూతన వ్యక్తిగత గోప్యత విధానాలను ఆమోదించాలని వినియోగదారులను ఒత్తిడి చేయబోమని తెలిపింది. కొత్త ప్రైవసీ పాలసీలపై దిల్లీ హైకోర్టు విచారణలో ఈ మేరకు వివరణ ఇచ్చింది వాట్సాప్.
వాట్సాప్ ప్రైవసీ పాలసీని ఆమోదించకుంటే.. సేవలను పరిమితం చేసే అంశంపైనా వాట్సాప్ వెనక్కి తగ్గింది. యూజర్లు అందరికీ ఒకే రకమైన సేవలను అందిస్తామని.. అప్డేట్స్ కూడా ఇస్తామని పేర్కొంది. ఈ విషయంపై ఇది వరకే స్పష్టతనిచ్చినప్పటికీ.. కొత్త ప్రైవసీ పాలసీ గురించి నోటిఫికేషన్ పంపిస్తామని గత నెలలో వాట్సాప్ పేర్కొంది. అయితే ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం మార్చుకుంది.