కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్‌ను సవాలు చేస్తూ దిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మెసేజింగ్ యాప్ వాట్సాప్. కొత్త డిజిటల్ రూల్స్‌లో ఎన్క్రిప్టెడ్ సందేశాలను చదివేందుకు ప్రభుత్వం అనుమతి కోరుతున్నట్లు వివరించింది. అలా చేస్తే యూజర్ల వ్యక్తిగత గోప్యతను ఉల్లఘించినట్లేనని వాట్సాప్ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.
నిబంధనలు నిలిపివేయాలి..
కొత్త నిబంధనల ప్రకారం.. దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని లేదా ప్రజల భద్రతకు హాని కలిగించేలా తప్పుడు పోస్టులు పెడితే.. వాటి మూలాలను సదరు సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. అయితే భారత రాజ్యాంగం ప్రకారం.. ఇది వ్యక్తుల గోప్యత హక్కులను ఉల్లంఘించినట్లేనని వాట్సాప్ ఆరోపించింది. వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ సందేశాలు ఉంటాయని, ఒకవేళ కొత్త ఐటీ నిబంధనలను అనుసరిస్తే ఆ ఎన్క్రిప్షన్ను పక్కన పెట్టాల్సి వస్తోందని వాదనలు వినిపించింది. అందువల్ల ఈ నిబంధనలను వెంటనే నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొంది. వాట్సాప్ అభ్యంతరం తెలిపినప్పటికీ.. కొత్త ఐటీ రూల్స్ అమలు ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఫేస్బుక్ ఇటీవల ప్రకటించడం గమనార్హం. కొన్ని నిబంధనల విషయంలో కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు కూడా వివరించింది.
వాట్సాప్ ద్వంద్వ ప్రమాణాలు!
భారత ప్రభుత్వం, దేశ చట్టాలు వాట్సాప్ వంటి కంపెనీలను కాకుండా.. పౌరుల గోప్యతను కాపాడుతూనే.. హద్దులు విధించాలని టెక్ విశ్లేషకులు, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ టి.వి. మోహన్‌దాస్ పాయ్ పేర్కొన్నారు. వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వంద్వ ప్రమాణాలు కలిగి ఉన్నాయని ఆయన విమర్శించారు.
హై కోర్టులో వాట్సాప్ పిటిషన్ దాఖలు చేయడంపై పాయ్ స్పందించారు. గోప్యత దెబ్బతింటుందా లేదా అనేది కోర్టు స్పష్టం చేస్తుందని.. వాట్సాప్ కాదని పేర్కొన్నారు. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్తుందని జోస్యం చెప్పారు.