భారతీయుల జీవితంలో ఆధార్ కార్డ్ భాగమైపోయింది. ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని వివరాలు ఆ కార్డులో నమోదై ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఎలాంటి ధ్రువీకరణ పత్రం కోసమైనా ఆధార్ తప్పనిసరి అవుతోంది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా.. ఆదాయ పన్ను కట్టాలన్నా.. చివరికి కొవిడ్ టీకా తీసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. మరి ఎవరైనా మరణిస్తే వారి ఆధార్ కార్డు సంగతేంటి? ప్రభుత్వం దాన్ని ఏం చేయనుంది? దీనికి కేంద్రం తాజాగా సమాధానమిచ్చింది. ప్రస్తుతానికైతే మృతిచెందినవారి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం లేదని స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో ఈ ప్రక్రియను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
ఇప్పటివరకు తీసుకురాలేదు..
వ్యక్తులు మరణిస్తే వారి ఆధార్‌ను ఏం చేస్తున్నారు? అని పార్లమెంట్‌లో లేవనెత్తిన ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఆధార్ కలిగిన వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆధార్‌ను రద్దు చేసే నిబంధనలను ఇప్పటివరకు తీసుకురాలేదన్నారు. కానీ ఈ ప్రక్రియను అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసేటప్పుడు మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆధార్ తీసుకునేందుకు.. జనన మరణాల నమోదు చట్టానికి సంబంధించిన ముసాయిదా సవరణలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సూచనలు కోరినట్లు చంద్రశేఖర్ పేర్కొన్నారు.