కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ప్రభుత్వ యంత్రాంగంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ద్వీప సమూహంలో నివసించే ప్రజలు ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సంస్కృతి, జీవనవిధానాన్ని కాపాడుకునేందుకు గళమెత్తుతున్నారు.
సమస్య ఏంటి?
2020 డిసెంబర్ 4న లక్షద్వీప్ పాలనాధికారి దినేశ్వర్ శర్మ మరణించారు. ఆయన స్థానంలో గుజరాత్ మాజీ మంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు సన్నిహితుడైన ప్రఫుల్ ఖోడా పటేల్ బాధ్యతలు స్వీకరించారు. దమణ్, దీవ్లకు పాలనాధికారిగా ఉన్న ఈయనకే లక్షద్వీప్ బాధ్యతలు అప్పగించింది కేంద్రం. ఈయన రాకతో ఇక్కడ సమస్యలు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రఫుల్ ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు లక్షద్వీప్ వాసుల్లో అసంతృప్తి రగిలించాయని సమాచారం.
లక్షద్వీప్ ప్రజలు తమ సంస్కృతిని గొప్పగా భావిస్తారు. ప్రకృతిని కాపాడుకోవడాన్ని తమ బాధ్యతగా పరిగణిస్తారు. ఈ కేంద్రపాలిత ప్రాంత రక్షణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ మద్యం విక్రయాలు ఉండవు. బయటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేసే అధికారం ఉండదు. స్థానికేతరులు ఇక్కడికి రావాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
ఆ చట్టాలతో పేచీ!
ప్రఫుల్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన.. లక్షద్వీప్ జంతు సంరక్షణ చట్టం, సామాజిక వ్యతిరేక కార్యకలాపాల చట్టం, డెవెలప్మెంట్ అథారిటీ చట్టం, పంచాయతీ సిబ్బంది నియమాల సవరణ వంటి చట్టాలు ప్రజల ఆగ్రహానికి లోనవుతున్నాయి. ఎవరినైనా నిర్బంధించేలా పోలీసులకు అధికారాలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల నుంచి దీనిపై సామాజిక మాధ్యమాల్లోనూ చర్చ జరుగుతోంది. 'సేవ్ లక్షద్వీప్' పేరుతో ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కేరళలోని అధికార విపక్ష కూటములు లక్షద్వీప్ వాసులకు మద్దతుగా ప్రకటనలు కూడా చేస్తున్నారు.
మైనింగ్‌కు వ్యతిరేకం
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతిశీల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అధికారాలను డెవెలప్మెంట్ అథారిటీ చట్టం కల్పిస్తుంది. భూమిని అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. మైనింగ్, ఇంజినీరింగ్, భవన నిర్మాణాలు చేపట్టే వీలు కల్పిస్తుంది. అయితే, జీవజాతులు భాసిల్లే ఈ ద్వీపాలలో అభివృద్ధి పేరిట మైనింగ్, క్వారీయింగ్ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఈ చట్టం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంలోని భూములను పార్కులు, పరిశ్రమలు, నివాస, వాణిజ్య సముదాయాలుగా వర్గీకరించే అధికారం పాలకులకు లభిస్తుంది. వర్గీకరణ తర్వాత ఆక్రమిత భూముల్లో ఉంటున్నట్లు తేలిన వారి నివాసాలను తొలగించే అవకాశం ఉంది.
రోడ్ల విస్తరణ
మరోవైపు, ఈ ప్రాంతంలో రోడ్ల విస్తరణ చేపట్టాలని పటేల్ ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం అడ్డుగా ఉన్న ఇళ్లను ధ్వంసం చేయమని ఆదేశించినట్లు స్థానికులు చెబుతున్నారు. లక్షద్వీప్‌లో ఉన్న వాహనాల సంఖ్య చాలా తక్కువ. అందులోనూ ఉన్నవి ద్విచక్రవాహనాలే! అలాంటప్పుడు ఇళ్లు తొలగించి మరీ రోడ్ల విస్తరణ చేపట్టే అవసరమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
బీఫ్ నిషేధం
లక్షద్వీప్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని డెయిరీ ఫామ్‌లను నూతన పాలనాధికారి పటేల్ మూసేయించినట్లు తెలుస్తోంది. గోవధను నిషేధించం, బీఫ్ ఉత్పత్తుల అమ్మకం, కొనుగోళ్లను నివారించేందుకే ఇలా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో మాంసాహార మెనూను సైతం తొలగించారని ద్వీపవాసులు వాపోతున్నారు.
ఇద్దరు పిల్లలు