జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతలతోప్రధాని నరేంద్ర మోదీ సమావేశం.. అక్కడ మళ్లీ రాజకీయ కార్యకలాపాలు ఊపందుకోవడానికి దోహదపడుతుందని చెప్పొచ్చు. 2019 ఆగస్టులో.. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అయినప్పటినుంచి.. అక్కడి అధికారాలు కేంద్రం చేతుల్లోకి వచ్చాయి. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మోదీ భేటీతో.. మళ్లీ రాజకీయ ఆట ఆరంభం అవుతుందని భావిస్తున్నారు.
జూన్ 24న జరిగిన సమావేశంలో.. జమ్ముకశ్మీర్ ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. అయితే.. ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) పూర్తయితేనే ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని ప్రధాని తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియ కొన్ని నెలల్లో పూర్తయితే.. వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.
మరి అసలు మోదీ ప్రభుత్వం.. డీలిమిటేషన్ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించడానికి కారణం ఏంటి? అసలు నియోజకవర్గాల పునర్విభజన ఎందుకు? జమ్ముకశ్మీర్‌లో కొన్నేళ్లుగా ఇది వివాదాస్పదంగా ఎందుకు మారింది? ఇప్పుడెంత వరకు వచ్చింది? అనేది తెలుసుకుందాం.
డీలిమిటేషన్ అంటే..?
డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన..
లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గ సరిహద్దులను గుర్తించడమే పునర్విభజన. ప్రతి నియోజకవర్గంలో దాదాపు సమాన సంఖ్యలో ఓటర్లు ఉన్నారని నిర్ధరించడానికి కొన్నేళ్లకోసారి ఈ ప్రక్రియ జరుగుతుంది. జనాభా సంఖ్యను బట్టి నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు. అంటే జనాభాకు అనుగుణంగా.. ఆ సంఖ్య పెరగొచ్చు. తగ్గొచ్చు. దీనిని బట్టే ప్రజాప్రతినిధుల ఎన్నిక జరుగుతుంది.
పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలు ఎప్పుడంటే అప్పుడు పెరగవు. మన దేశంలో పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. దీన్నే నియోజకవర్గాల పునర్విభజన అంటారు. దీనికి రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. రాష్ట్రపతి కేంద్ర మంత్రివర్గ సలహా ప్రకారం నడుచుకుంటారు.
ఆ కమిషన్ ఏర్పాటుతోనే?
ప్రతి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గ పునర్విభజనకు చట్టం చేసే అవకాశాన్ని రాజ్యాంగంలోని 82వ అధికరణం పార్లమెంటుకు ఇస్తోంది. ఈ చట్టం ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది.
ఆ కమిషన్ సిఫార్సులను మార్చేందుకు.. పార్లమెంటుకు కూడా అధికారం లేదు.
పునర్విభజన కమిషన్‌లో ఎవరెవరు?
ఈ కమిషన్‌లో ఒక ఛైర్మన్(రిటైర్డ్/ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి), చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, డీ లిమిటేషన్ చేసే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఇంకా.. ఆ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటు, శాసనసభ సభ్యులు ఐదుగురు చొప్పున ఉంటారు.
పునర్విభజన కమిషన్ తాత్కాలికం కాబట్టి.. పూర్తి స్థాయి సిబ్బంది లేని కారణంగా డీలిమిటేషన్ ప్రక్రియ కోసం ఇది ఎన్నికల కమిషన్ ఉద్యోగులపై ఆధారపడుతుంది. ప్రతి జిల్లా, మండలం, గ్రామ పంచాయతీల జనాభా లెక్కల సమాచారం సేకరించి, కొత్త సరిహద్దులను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ కోసం ఒక్కోసారి ఐదేళ్ల వరకు పట్టొచ్చు.
కశ్మీర్లో వేరేలా ఎందుకు?
అధికరణ 370 కల్పించే ప్రత్యేక అధికారాల కారణంగా.. జమ్ముకశ్మీర్‌లో పునర్విభజన ప్రక్రియ దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది.
- 2019లో జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా కోల్పోయే ముందు వరకు లోక్‌సభ స్థానాల్లో డీలిమిటేషన్ భారత రాజ్యాంగం పరిధిలో.. అసెంబ్లీ సీట్లలో డీలిమిటేషన్ జమ్ముకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం పరిధిలో ఉండేవి.
- జమ్ముకశ్మీర్‌లో మొదటిసారిగా 1952లో పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత.. 1963, 73, 2002లోనూ ఈ కమిషన్ ఏర్పాటైంది.
చివరగా కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన 1995లో జరిగింది. అప్పుడు రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. 2005లో తర్వాతి డీలిమిటేషన్ జరగాల్సి ఉన్నా.. 2002లో అప్పటి ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం 2026 వరకు ఈ ప్రక్రియ అవసరం లేదని జమ్ముకశ్మీర్ ప్రజా ప్రాతినిధ్య చట్టం-1957 ప్రకారం నిర్ణయించింది.